ప్రతి ఘటనా వైఎస్సార్ సీపీపైకే నెట్టేస్తారా..!
● బురద జల్లి రాజకీయ పబ్బం గడుపుతారా?
● మంత్రి సుభాష్ తీరుపై
ధ్వజమెత్తిన పార్టీ నేతలు
అమలాపురం టౌన్: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ మొన్నటి వరకూ వైఎస్సార్ సీపీలోనే ఉండి, నేడు ప్రతి ఘటనను ఆ పార్టీపైనే తోసేసి మాట్లాడడం సరికాదని అమలాపురం పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సంసాని బులినాని, కోనసీమ శెట్టిబలిజ కార్తిక వన సమారాధన కమిటీ ప్రతినిధులు అన్నారు. అమలాపురం వాసర్ల గార్డెన్స్‌లో వారు సోమవారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల అమలాపురంలో జరిగిన ఓ హత్య కేసును సైతం మంత్రి సుభాష్ వైఎస్సార్ సీపీకి ముడిపెట్టి మాట్లాడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శమని ధ్వజమెత్తారు. హత్యకు గురైన వ్యక్తి, హత్య చేసిన వారు పాత స్నేహితులు, వారి మధ్య నెలకొన్న పాత కక్షలతో హత్య చేశారని గుర్తు చేశారు. పైపెచ్చు హత్య కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నాయకురాలికి స్వయంగా సోదరుడని గుర్తు చేశారు. ఈ హత్యను వైఎస్సార్ సీపీ గుండాలు అత్యంత కిరాతంగా చేశారని ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించినప్పుడు మంత్రి సుభాష్ మాట్లాడారని అన్నారు. తీరా జిల్లా ఎస్పీ ప్రెస్‌మీట్‌లో హత్యకు గురైన వ్యక్తి కళ్లు, కనుబొమ్మలు తొలగించడం వంటి ఆనవాళ్లు తమ దర్యాప్తులో కనిపించలేదని, బాడీ డీ కంపోజ్ కావడం వల్ల శరీరం బాగా పాడైపోయిందని స్పష్టం చేశారని చెప్పారు. ఎస్పీ స్టేట్‌మెంట్‌కు మంత్రి చేసిన ఆరోపణలు విరుద్ధంగా ఉన్న క్రమంలో ఆయన మాటలు కేవలం వైఎస్సార్ సీపీపై కక్ష పూరితంగా మాట్లాడినవేనని తెలుస్తోందన్నారు. మంత్రే ఓ పోలీస్ అధికారిగా కేసు గురించి మాట్లాడడంపై వారు అభ్యంతం చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే ఈ హత్య కేసులో వైఎస్సార్ సీపీ పాత్ర ఉందని రుజువు చేయాలని బులినాని సవాల్ విసిరారు. సుభాష్ మంత్రి అయ్యాక శెట్టిబలిజలు రెండుగా చీలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురంలో ఏటా నిర్వహించే కార్తిక వన సమారాధన వేదికపై నుంచి తనకు నచ్చని ముఖ్యంగా వైఎస్సార్ సీసీ శెట్టిబలిజ నేతలపై పనిగట్టుకుని మంత్రి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఇక నుంచి శెట్టిబలిజ నేతలపై నోరు పారేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. అమలాపురం అల్లర్ల సమయంలో సుభాష్ భయంతో అజ్ఞాతంలో ఉన్నారని బులనాని గుర్తు చేశారు. కోనసీమ శెట్టిబలిజ కార్తిక వన సమారాధన కమిటీ ప్రతినిధులు మట్టపర్తి మీరా సాహెబ్‌శెట్టి, వాసంశెట్టి సుభాష్, కుడుపూడి భరత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.


