పేదల గూటికి గొళ్లేలు! | - | Sakshi
Sakshi News home page

పేదల గూటికి గొళ్లేలు!

Nov 10 2025 7:32 AM | Updated on Nov 10 2025 8:24 AM

కల్లలవుతున్న సొంతింటి కల

పీఎంఏవై వాటా చెల్లింపులో

కూటమి ప్రభుత్వం మొండిచేయి

నిర్మాణ వ్యయం పెరిగిందన్న నెపంతో

రూ.2.5 లక్షల నుంచి 1.8 లక్షలకు కుదింపు

గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు తీవ్ర నిరాశ

ఆలమూరు: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇళ్లు లేని నిరుపేదలకు మూడు సెంట్ల స్థలం కేటాయిస్తామని, రూ.ఐదు లక్షల రుణం ఉచితంగా అందిస్తామని గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నేతలు అమలుకు సాధ్యం కాని హామీలతో ఊదరగొట్టారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల కావస్తున్నా పాలకులు ఆ ఊసే ఎత్తడంలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ప్రధానమంత్రి అవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్య వైఖరి వల్ల పేదల ఇళ్ల నిర్మాణాలు ప్రశ్నార్థకమయ్యాయి. పీఎంఏవై పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.70 వేలు, ఎన్‌ఆర్జీఈఎస్‌ పథకం కింద రూ.30 వేలు వాటాగా లబ్ధిదారునికి ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుని ప్రకటనను కూడా జారీ చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 22 మండలాలు, మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో 14,487 మంది ధరఖాస్తు చేసుకున్నారు. పీఎంఏవై పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ అధికారులు కేత్రస్థాయిలో పట్టణాలు, పల్లెల్లో పీఎంఏవై యాప్‌ ద్వారా సర్వే చేపట్టి సుమారు 60 శాతం మేర పూర్తి చేశారు. ఇప్పటికే జిల్లా పరిధిలో ఉన్న పలు గ్రామాలు అమలాపురం కేంద్రంగా ఔడా పరిధిలోను, మరికొన్ని గ్రామాలు రాజమహేంద్రవరం కేంద్రంగా రుడా పరిధిలోనూ ఉన్నాయి. గ్రామ పంచాయతీలు అన్ని పట్టణాభివృద్ధి కేంద్రాల పరిధిలోకి వెళ్లి పోవడంతో ఆ మేరకు పీఎంఏవై పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలుత జిల్లా అంతటినీ ఒక యూనిట్‌గా తీసుకుంది. పీఎంఏవై పథకం ద్వారా ప్రతి లబ్ధిదారునికి పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రూ.2.50 లక్షలు మంజూరు చేస్తామని గృహ నిర్మాణ శాఖాధికారులు సర్వే సమయంలో కూడా తెలిపారు.

మొదటికి వచ్చిన

లబ్ధిదారుల సర్వే

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయంతో గృహ నిర్మాణశాఖ అధికారులు ఇప్పటి వరకూ చేసిన సర్వే మళ్లీ మొదటికి వచ్చింది. ఇక నుంచి పట్టణాల్లో పీఎంఏవై (అర్బన్‌) యాప్‌ లోను, గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవై (రూరల్‌) యాప్‌లోను విడివిడిగా సర్వే చేసి అర్హులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినా యాప్‌లను పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. దీంతో గృహ నిర్మాణ శాఖాధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

గృహ రుణాల మంజూరు రీసర్వే పేరుతో రుణ పరిమితిని తగ్గించామని చెప్పేందుకు ప్రజల్లోకి ఏముఖం పెట్టుకుని మళ్లీ వెళతామనని వారు సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. అనుమతులు వచ్చేటప్పటికి పట్టణాభివృద్ధి పరిధిలోకి, రుణాల మంజూరులో గ్రామీణ స్థాయిలోకి నెట్టడం సరికాదనే సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గత వైఎస్సార్‌ సీపీ హయాంలో

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం, నిరుపేదలకు సరైన గూడు కల్పించడం కోసం జిల్లాలో లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు, వేలాది మంది నివసించేందుకు కాలనీలు నిర్మించిన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచారు. జిల్లాలో ఏ మండలానికి వెళ్లినా వైఎస్సార్‌ సీపీ హయాంలో సర్వ హంగులతో ప్రైవేట్‌ కాలనీల మాదిరిగా సర్వాంగ సుందరంగా నిర్మించిన జగనన్న కాలనీలు ప్రస్తుతం దర్శనమివ్వడం నాటి పరిస్థితికి అద్దం పడుతోంది. పేదలందరికీ సరైన గూడు కల్పించాలన్న సృహ కూటమి ప్రభుత్వానికి లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది.

దరఖాస్తులిలా..

నియోజకవర్గం దరఖాస్తులు

అమలాపురం 2812

ముమ్మిడివరం 2805

రాజోలు 1493

కొత్తపేట 2442

పి.గన్నవరం 2868

మండపేట 735

రామచంద్రపురం 1332

మేడంటే మేడా కాదూ.. గూడంటే గూడూ కాదు.. పదిలంగా అల్లూకున్నా పొదరిల్లూ మాదీ.. అనే సినీ గీతానికి సరిపోయేలా సాగింది నాటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల కలలకు ‘వరం’లా. పేద్ద ఇంద్రభవనమా అంటే కాదు.. అలా అని పూరి గుడిసె కూడా కాదు.. ఓ చిన్న కుటుంబం సంతృప్తిగా జీవించడానికి అవసరమైన వసతులతో నీడనిచ్చిన జగనన్న ప్రభుత్వాన్ని ఆ పేదలు ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఓ సొంతిల్లు కట్టుకోవాలని కలగనని కుటుంబం ఉండదు. ఆ కల సాకారానికి పేదలు నిత్యం ప్రభుత్వాలకు అర్జీలు పెడుతూనే ఉంటారు. దేవుడు వరమిచ్చినా పూజారి ఒప్పుకోని చందంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెట్టి తన భాగస్వామ్య నిధులు మంజూరు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్‌ నిధులు విడుదల చేయడంలో ఎన్నో కొర్రీలు పెడుతుండడంతో సమస్య ఎడతెగక సందిగ్ధంలో పడిపోతుంటాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్తున్న సాకులు.. పెడుతున్న గొళ్లాలు అలానే అనిపిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపునకు నిరాకరణ

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎంఏవై పథకంలో ఒక్కొక్క లబ్ధిదారునికి రూ 2.5 లక్షలు చెల్లించాల్సి ఉంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.70 వేలను గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకు చెల్లించలేమంటూ కూటమి సర్కార్‌ చేతులెత్తేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న పీఎంఏవై యాప్‌ను అర్బన్‌, రూరల్‌గా విభజించింది. ఇప్పటివరకూ లబ్ధిదారునికి రూ.2.5 లక్షలు మంజూరు చేస్తామంటూ క్షేత్రస్థాయిలో చేసిన సర్వేను రద్దు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంత లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక నుంచి ఈ లబ్ధిదారులకు రూ 1.80 లక్షలు రుణ వసతి మాత్రమే మిగిలింది. అసలే పెరిగిన గృహ నిర్మాణ సామగ్రి ధరలతో పాటు కార్మికుల వేతనాలు విపరీతంగా పెరిగి పోయిన తరుణంలో రుణ పరిమితిలో కోత విధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గృహ రుణాలను మంజూరు చేయకపోగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఏవై పథకంలోను కొర్రీలు పెట్టడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పేదల గూటికి గొళ్లేలు!1
1/3

పేదల గూటికి గొళ్లేలు!

పేదల గూటికి గొళ్లేలు!2
2/3

పేదల గూటికి గొళ్లేలు!

పేదల గూటికి గొళ్లేలు!3
3/3

పేదల గూటికి గొళ్లేలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement