దారి ఆక్రమణపై ఉద్రిక్తత
● టీడీపీ నేత ఆగడాలతో వివాదం
● ఆందోళన చేసిన స్థానిక మహిళలు
● వారిని వైఎస్సార్ సీపీ వర్గీయులుగా చూపే ప్రయత్నం
● ఇరు వర్గాలపై కేసులు నమోదు
కొత్తపేట: కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక ఆత్రేయపురం మండలంలో టీడీపీ నాయకుడు, ప్రస్తుతం ప్రముఖ దేవస్థానం చైర్మన్‌గా చలామణి అవుతున్న వ్యక్తి ఆగడాలకు, దౌర్జన్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తాజాగా రహదారిని సైతం కబ్జా చేశారంటూ తలెత్తిన అంశంపై వివాదం తలెత్తింది. ఆ రహదారి కోసం పలు కుటుంబాల మహిళలు తీవ్ర నిరసన, ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల తరఫున అల్లూరి ప్రసాదరాజు అనే టీడీపీ నాయకుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్రేయపురంలో పెద్ద రామాలయం వద్ద ప్రధాన రహదారికి అనుసంధానంగా ఎప్పటి నుంచో ఉమ్మడి స్థలాలతో ఏర్పాటుచేసుకున్న రోడ్డు రాజమార్గంగా ఉండేది. పూర్వపు తాగునీటి చెరువును కలుపుతూ ఉండే ఈ రోడ్డుపై మహిళలు నీటిని తెచ్చుకునేవారు. గతంలో ఈ రోడ్డు నిర్మాణానికి పంచాయతీలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా 2018లో మండల టీడీపీ నాయకుడు మార్గానికి స్థలం వదిలిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి తన పేరున, తన తమ్ముడు పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుని పత్రాలు సృష్టించారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సుమారు 10 సెంట్ల రోడ్డు స్థలాన్ని స్వాధీనం చేసుకుని జేసీబీలతో భారీ స్థాయిలో మట్టిని తవ్వి పొలాలకు తరలించి రోడ్డు ఆనవాళ్లు లేకుండా ఇసుకతో నింపారు. అనంతరం ఆ స్థలానికి చుట్టూ కంచె వేశారు. దానితో సుమారు 12 కుటుంబాల వారికి రాకపోకలకు మార్గం తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఆ చర్యను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా స్థానికులు నిరసన వ్యక్తం చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా స్పందన లేకపోవడంతో ఆ రోడ్డును ఆనుకుని నివసిస్తున్న వేగేశ్న చంద్రావతి అనే మహిళ తన అల్లుడు, తెలుగుదేశం నాయకుడు అయిన అల్లూరి ప్రసాదరాజు సహకారంతో హైకోర్టును ఆశ్రయించగా తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది. ఇక్కడ గల ప్రధాన రహదారికి అడ్డంగా ఉన్న కంచెను తొలగించి రోడ్డును పునరుద్ధరించాలని గ్రామ కార్యదర్శికి గత నెల 5న కోర్టు ఆదేశించింది. అయినా ఫలితం లేకపోవడంతో స్థానిక మహిళలు రహదారిని పునరుద్ధరించాలని కోరుతూ ఆదివారం పెద్ద రామాలయం వద్ద నిరసన చేపట్టారు. దీంతో స్థానిక టీడీపీ నేత ఆ మహిళలపై దౌర్జన్యానికి పాల్పడి పోలీసుల సాయంతో బెదిరించారు. నిరసన తెలియజేస్తున్న ప్రజలను వైఎస్సార్ సీపీ వర్గీయులుగా ముద్ర వేసి లబ్ధి పొందేందుకు యత్నించారు.
పోలీసుల తీరుపై ఆందోళన
న్యాయం కోసం రోడ్డెక్కిన తమపై పోలీసుల తీరు ఏకపక్షంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులకు ఫిర్యాదు చేసి స్థానికులపైకి ఉసిగొలిపారని, మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యం చేశారని ఆరోపించారు. సివిల్ కేసును క్రిమినల్ కేసుగా చిత్రీకరించి నిరసనను అణిచివేయడానికి ప్రయత్నించారని, నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు వేసిన టెంట్‌ను సైతం తొలగించి వారిపై అక్రమ కేసులు పెడతామని బెదిరించారని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఐ వివరణ
ఈ సమస్యపై రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్‌ను సాక్షి వివరణ కోరగా ఆత్రేయపురంలో రోడ్డు బ్లాక్ చేసి ఆందోళన చేస్తున్నారని వీఆర్‌ఓ ఇచ్చిన సమాచారం మేరకు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అక్కడి వెళ్లామన్నారు. వీఆర్‌ఓ ఫిర్యాదు, తన స్థలం ఫెన్సింగ్ తొలగించి ధ్వంసం చేశారని ముదునూరి వెంకట్రాజు అలియాస్ గబ్బర్‌సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.


