సైక్లింగ్‌తో ఆరోగ్య జీవనం
● ఎస్పీ రాహుల్ మీనా
● సైక్లోథాన్ 5కె రన్ ప్రారంభం
అమలాపురం టౌన్: నిత్యం కొన్ని కిలోమీటర్‌లైనా సైక్లింగ్ చేస్తే ఆరోగ్యకరమైన జీవన శైలి అలవడుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్పీ కార్యాలయం వద్ద సైక్లోథాన్ 5కె సైకిల్ ర్యాలీని ఆదివారం ఉదయం ఎస్పీ మీనా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజులో ఎంతో కొంత సమయం సైకిల్‌ను తొక్కి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత వేగవంతమైన జీవన విధానంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణంలోని మెయిన్ రోడ్ల మీదుగా 216 జాతీయ రహదారిపై గడియారం స్తంభం సెంటర్, హైస్కూలు రోడ్డు, కాలేజీ రోడ్డు, ఎత్తు రోడ్డు, వై.జంక్షన్ వరకూ ఐదు కిలో మీటర్ల మేర సాగింది. ఆరోగ్య ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ఐదు కిలో మీటర్ల మేర సైకిల్ తొక్కి నేను సైతం ఆరోగ్య పరిరక్షణలో ఉన్నానని ఎస్పీ మీనా తెలిపారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, జిల్లా ఏఆర్ డీఎస్పీ సుబ్బరాజు, స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, ఏఆర్ ఆర్‌ఐలు బ్రహ్మానందం, కోటేశ్వరరావు తదితర అధికారులు, పోలీస్ సిబ్బంది స్వయంగా సైకిళ్లు తొక్కుతూ ముందుకు సాగారు.


