భిక్షశాల తొలగింపుపైస్వాముల ఆందోళన
కపిలేశ్వరపురం (మండపేట): పంచాయతీ, పోలీసు అధికారుల తీరును నిరసిస్తూ మండపేట మండలం కేశవరంలో ఆదివారం అయ్యప్ప మాలధారులు ధర్నాకు దిగారు. పీఠం సమీపంలో తాము ఏర్పాటు చేసుకున్న వంటశాలను తొలగించే ప్రయత్నం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశవరంలోని కామాక్షి అమ్మవారి ఆలయంలో ఏటా పీఠం ఏర్పాటు చేసి పూజలు చేస్తుంటారు. ఆలయాన్ని ఆనుకుని సుమారు సెంటు స్థలంలో ఇటీవల స్వాములు రేకులతో వంటశాలను ఏర్పాటు చేసుకుని భిక్ష చేస్తున్నారు. దీనిపై పంచాయతీ అధికారి సుబ్బారావు అనుమతులు లేకుండా షెడ్డు నిర్మించడం సరికాదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై స్పందించిన పోలీసు, పంచాయతీ సిబ్బంది శనివారం రాత్రి ఆ షెడ్డు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ చర్యను ప్రతిఘటించిన స్వాములు ఆదివారం ఉదయం ఘటనా స్థలం వద్ద ధర్నాకు దిగి నినాదాలు చేసి, వంటశాల వద్దనే భక్ష చేసి నిరసన తెలిపారు.


