కాలాతీతుడు మహాకవి నన్నయ
కాజులూరు: మహా భారత రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఆదికవి నన్నయ కాలాలకు అతీతుడైన మహాకవి అని, ఎన్ని వేల ఏళ్లైనా ఆయన రచనలు నిత్య నూతనమైనవని చీరాల అజోవిభో ఫౌండేషన్‌కు చెందిన సుప్రసిద్ధ సాహితీవేత్త, ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ అబిప్రాయపడ్డారు. పల్లిపాలెంలోని కామరాజు సాంస్కృతిక ప్రాంగణంలో గల మధుశ్రీ హాల్‌లో ఆదివారం ఉదయం ఆంధ్రీ కుటీరం నిర్వాహకుడు, ప్రముఖ కవి మధునాపంతుల సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ జయంతి సభ నిర్వహించారు. అనంతరం జరిగిన కళా ప్రపూర్ణ, ఆంధ్ర పురాణకర్త మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి 33వ వర్ధంతి సభలో ప్రముఖ సాహితీవేత్త వాడ్రేవు చినవీరభద్రుడు ఆంధ్రీ కుటీరానికి అంకితం చేసిన తెలుగదేలయన్న గ్రంథాన్ని ప్రముఖ సాహితీవేత్త ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖ రచయితలు, కవులను ఆంధ్రీకుటీరం నిర్వాహకులు జ్ఞాపికలు ఇచ్చి సాలువాలతో ఘనంగా సత్కరించారు.
శతాధిక వృద్ధుడి మృతి
కరప: మండలం కూరాడ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధ పాస్టర్ మోర్త అండ్రేయ (104) ఆదివారం మృతి చెందారు. ఆండ్రేయ సొంత గ్రామం రామచంద్రపురం సమీపంలోని నరసాపురపేట. ఆ గ్రామం నుంచి 1975లో కరప మండలం కూరాడ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. కొద్దిరోజుల ముందు వరకు ఆయన సువార్త చెప్పేవారు. ఇంతవరకు ఆయన తన పనులు తానే చేసుకునేవారని, వయసురీత్యా కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం పరలోకగతులయ్యారని బంధువులు తెలిపారు. ఆయనకు ముగ్గురు కుమారు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆండ్రేయ మృతికి మండల అంబేడ్కర్ యువజనసేవా సంఘం ప్రతినిధి చిన్నం వెంకటేశ్వరరావు తదితర గ్రామస్తులు సంతాపం వ్యక్తంచేశారు.


