కూటమి ప్రభుత్వానివి డైవర్షన్ పాలిటిక్స్ : మాజీ ఎమ్మెల
ఐ.పోలవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని, వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చెందిన నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆరోపించారు. దీనిలో భాగంగానే మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఐ.పోలవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కల్తీ మద్యం కేసులో ఎటువంటి సంబంధం లేకపోయినా జోగి రమేష్‌ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కూటమి పార్టీకి చెందినవారే కల్తీ మద్యం తయారు చేస్తున్నారని వెలుగులోకి రావడంతో ఆ నెపాన్ని వైఎస్సార్ సీపీ నాయకులపై నెడుతున్నారని ఆరోపించారు. ఈ తీరు మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో ఇంతకు పది రెట్లు ఇబ్బంది పడవలసి వస్తుందని హెచ్చరించారు. అక్రమ అరెస్టులకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్య మంత్రి చేసుకునేందుకు ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని పొన్నాడ అన్నారు. పార్టీ ఎస్‌ఈసీ సభ్యు డు పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఈ కేసుతో తన ప్రమేయం లేదని ఇటీవల జోగి రమేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ దుర్గమ్మ గుడిలో ప్రమాణం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు, కూటమి నేతలు ఇలా ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఎస్‌ఈసీ సభ్యురాలు కాశి మునికుమారి, ఎంపీపీ మోర్తా రాణి మరియం జ్యోతి, దొరబాబు, ఎం.శివ, పి.వెంకటేశ్వరరావు, కె.ప్రసాద్ పాల్గొన్నారు.


