వైభవంగా వాడపల్లి వెంకన్న జల విహారం
కొత్తపేట: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి తెప్పోత్సవాన్ని ఆదివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. గౌతమి గోదావరిలో పుష్పాలతో అలంకరించిన పడవపై స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి జల విహారం చేశారు. కే్‌ష్‌త్రానికి భక్తజనం పోటెత్తారు. ఉదయం నుంచీ క్యూ లో బారులు తీరారు. గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణం కార్యక్రమాలతో పాటు వేంకటేశ్వరస్వామి వారికి ద్వాదశి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహించారు.
నేత్రపర్వంగా నరసన్న తెప్పోత్సవం :
ఘనంగా క్షీరాబ్ది ద్వాదశి వేడుకలు
సఖినేటిపల్లి: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం పల్లిపాలెంలో స్థానిక అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ద్వాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘ ప్రతినిధుల నేతృత్వంలో వశిష్ట గోదావరి నదిలో అంతర్వేది లక్ష్మీనృసింహుని తెప్పో త్సవం వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ పర్యవేక్షణలో పల్లిపాలెం పుష్కరరేవు వద్ద పంటును హంస వాహనంగా రూపొందించి దానిపై స్వామి, అమ్మవార్లను కొ లువుదీర్చి ఈ ఉత్సవాన్ని కనుల పండువగా చేశారు.
తొలుత అంతర్వేది ఆలయం నుంచి గరుడ పుష్పక వాహనంపై శ్రీస్వామి, అమ్మవార్లను కొలువు దీర్చిన అర్చకులు, మంగళ వాయిద్యాలతో పల్లిపాలెం పుష్కరరేవు వద్దకు అగ్నికుల క్షత్రియులతో కలిసి ఊరేగింపుగా తోడ్కొని వచ్చారు. ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చక స్వాములు వేద మంత్రాలతో హంస వాహనంపై శ్రీస్వామి, అమ్మవార్లను ఆసీనులను చేశారు. ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ స్వామివారికి పూజలు చేశారు. బాణసంచా కాల్పులతో పల్లిపాలెం పుష్కర రేవు వద్ద నుంచి గొంది సరిహద్దు వరకూ గోదావరిలో విహరింపచేశారు. అనంతరం శ్రీస్వామి, అమ్మవార్లను పుష్కర రేవుకు తిరిగి తీసుకువచ్చి, మంగళ వాయిద్యాలతో తిరిగి ఆలయానికి చేర్చారు. సర్పంచ్ ఒడుగు శ్రీను, ఎంపీటీసీలు బైర నాగరాజు, పోతాబత్తుల భాస్కరరావు, మాజీ సర్పంచ్ వనమాలి మూలాస్వామి పాల్గొన్నారు.
							వైభవంగా వాడపల్లి వెంకన్న జల విహారం
							వైభవంగా వాడపల్లి వెంకన్న జల విహారం

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
