కక్ష సాధింపుతోనే జోగి రమేష్ అరెస్ట్
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేసిందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. 1992లో సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి కౌల్ పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకూడదన్న ఉత్తర్వులు ఇచ్చారని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు సోమవారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఓ వ్యక్తిని నేరస్తుడిగా పరిగణించినప్పుడు అతను పోలీస్ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తే అరెస్ట్ చేయకూడదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను పోలీసులు పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. నకిలీ మద్యం కేసు సృష్టించి జోగి రమేష్‌ను అరెస్ట్ చేసి పోలీసులు తప్పు చేశారన్నారు. ప్రభుత్వ ఒత్తిడితో సిట్ పోలీసులు ఈ చర్యలకు పాల్పడ్డారన్నారు. ఈ అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం అక్రమ, నకిలీ మద్యం ఏరులై పారుతుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాకినాడ పోర్టులో విదేశాల నుంచి నకిలీ మద్యం, గంజాయి దిగుమతి అవుతున్నాయని ఆరోపించారు. జిల్లాలో నకిలీ మద్యం తయారవుతున్నా నిందితులపై ఎకై ్సజ్, పోలీసు అధికారులు కనీసం కేసులు పెట్టడం లేదన్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు కనిపించడం లేదా..? అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృత్యువాత పడడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని ఎమ్మెల్సీ ఆరోపించారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యం వల్లే ఆ ఆలయం వద్ద భక్తులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
