మృత్యు శకటం.. వేస్తారా కళ్లెం!
ఫ గాలి వేగంతో దూసుకెళ్తున్న టిప్పర్లు
ఫ భారీగా ఇసుక, గ్రావెల్ తరలింపు
ఫ ఉమ్మడి జిల్లాలో పొంచి ఉన్న ప్రమాదాలు
ఫ రంగారెడ్డి జిల్లా ఘటన నేపథ్యంలో
అప్రమత్తత అవసరం
అమలాపురం టౌన్: అడ్డూ అదుపూ ఉండదు.. వేగానికి కళ్లెం అసలే లేదు.. అధికారుల పర్యవేక్షణ కానరాదు.. రోడ్డెక్కితే ఆగమేఘాల మీద దూసుకుపోతున్నా, ఎందరో ప్రాణాలు తీస్తున్నా ఎవరికీ పట్టదు.. టిప్పర్ల జోరుకు అడ్డూ అదుపు కనిపించదు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక, గ్రావెల్ లోడ్లతో టిప్పర్లు రోడ్లపై రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. వీటిపై మైనింగ్, ట్రాన్స్‌పోర్టు, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారుల నియంత్రణ లేకపోవడం, సరైన నిఘా ఉండక తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపై వెళ్లే ప్రజల ప్రాణాలు ఒక్కోసారి గాల్లో కలిసిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 19 మంది మృత్యువాత పడ్డారు. టిప్పర్ వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగి అంత మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ దుస్థితి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఉంది. టిప్పర్ల అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు పొంచి ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 30కి పైగా ఇసుక ర్యాంపులు, 26 వరకూ క్వారీలు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు రెండు వేల టిప్పర్లు నిత్యం ఇసుక, గ్రావెల్‌తో రోడ్లపై రయ్‌రయ్ మంటూ అతి వేగంగా పరుగులు తీస్తున్నాయి. ఈ వేగమే ఒక్కోసారి అనర్థమై రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువగా నదీ పాయలు ఉండడంతో ఇసుక ర్యాంపుల నుంచి ఈ టిప్పర్లు అధిక లోడుతో ఇసుకను వేగంగా రవాణా చేస్తున్నాయి. ఒక్కో టిప్పర్ రోజుకు మూడు లేదా నాలుగు ట్రిప్పులు వేయాల్సి ఉంటుంది. అలాగే రాజమహేంద్రవరం, ఐ.పంగిడి పరిసర గ్రామాల్లో ఎక్కువగా ర్యాంపులు, క్వారీల నుంచి కూడా టిప్పర్లు గ్రావెల్ లోడుతో అతివేగంగా రోడ్లపై దూసుకుపోతున్నాయి. ఈ టిప్పర్లకు రోజుకు ఇన్ని ట్రిప్పులని లక్ష్యాన్ని నిర్దేశించడంతో కొందరు డ్రైవర్లు అతివేగంగా నడుపుతున్నారు. కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం తదితర ప్రాంతాల నుంచి గ్రావెల్ లోడ్లతో టిప్పర్లు జిల్లా కేంద్రం కాకినాడ నగరానికి ఎక్కువగా వస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో భవనాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు అధికం కావడంతో టిప్పర్ల ద్వారా ఇసుక, గ్రావెల్, ఇటుక వంటి మెటీరియల్ ఎక్కువగా ఎగుమతి, దిగుమతులు అవుతున్నాయి. మైన్స్ శాఖ అధికారులు తమ శాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నా అతి వేగాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ట్రాన్స్‌పోర్టు, పోలీస్ శాఖల అధికారులు టిప్పర్లపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండడం, సరైన నిఘా పెట్టకపోవడంతో వాటి వేగాన్ని ఎవరూ నియంత్రించక చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా టిప్పర్ల వేగంపై నియంత్రణ కరవై రోడ్డు ప్రమాదాలు, మరణాలు అనివార్యమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం చేవళ్ల రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం స్థాయి ఉమ్మడి జిల్లాలో ఇప్ప టి దాకా జరగకపోవడం మంచి పరిణామమే గాని పొంచి ఉన్న రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని జిల్లా ప్రజలు ఊహించుకుని బెంబేలెత్తుతున్నారు. టిప్పర్లు ఇసుక లేదా గ్రావెల్ తరలిస్తున్నప్పుడు విధిగా ఆ లోడుపై బరకం కప్పాలి. బరకం వినియోగించకపోవడం వల్ల ఇసుక లేదా గ్రావెల్ వెనుక వచ్చే వాహనచోదకుల కళ్లలో పడి ఇబ్బందిగా ఉంటుంది. ఈ నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే అమలవుతున్నాయని వాహనచోదకులు అంటున్నారు.
124 కేసుల నమోదు
టిప్పర్ల అతివేగాన్ని జిల్లా రవాణా శాఖ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. టిప్పర్లపై ఇసుక, గ్రావెల్ తరలిస్తున్నప్పుడు బరకాలు కప్పకపోవడం, ఇరుకు రోడ్లలో సైతం అతి వేగంగా వెళ్లడం, టిప్పన్ కండీషన్ సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలపై తరచూ తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం. ఈ నేరాలపై జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 124 కేసులు నమోదు చేశాం.
–డి.శ్రీనివాస్,
జిల్లా రవాణాధికారి,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
							మృత్యు శకటం.. వేస్తారా కళ్లెం!

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
