చోరీ కేసులో నిందితుల అరెస్ట్
క్లుప్తంగా
తాళ్లపూడి: వృద్ధురాలి మెడలో బంగారు మంగళ సూత్రాల తాడు తెంచుకుని పరారైన కేసులో ముగ్గురిని సోమవారం అరెస్ట్ చేసి రూ.2.50 లక్షల సొత్తు రికవరీ చేశారు. తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ కథనం ప్రకారం.. గత నెల 8న తాళ్లపూడి మండలం గజ్జరంలో గన్నిన నరసమాంబ (70) తన ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. టీవీ పని చేయడం లేదని ఫిర్యాదు వచ్చిందని, దానిని బాగు చేయడానికి వచ్చామని ఆమెకు చెప్పారు. టీవీ బాగానే పని చేస్తుందని నరసమాంబ చెప్పగా, అయితే టీవీ పక్కన నిలబడితే ఫొటో తీసుకుంటామని చెప్పి, ఆమెను బెదిరించి మెడలోని బంగారు మంగళ సూత్రాల తాడును లాక్కొని బయటకు వచ్చేశారు. అప్పటికే బయట బైక్‌పై ఉన్న మూడో వ్యక్తి సహాయంతో పరారయ్యారు. ఈ మేరకు బాధితురాలు తాళ్లపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోమవారం బల్లిపాడు గోదావరి ర్యాంపు వద్ద ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో షేక్ సుభానీ జానీ, దేశగిరి గంగరాజు, వడ్డి శరణ్‌రాజులను పట్టుకుని, చోరీ సొత్తుతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. సీసీ కెమేరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నామన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
