రౌడీషీటర్లు నేర ప్రవృత్తిని వీడాలి
ఎస్పీ రాహుల్ మీనా
అమలాపురం టౌన్: రౌడీ షీటర్లు నేర ప్రవృత్తికి స్వస్తి పలికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూ రంగా ఉండాలని ఎస్పీ రాహుల్ మీనా హితవు పలికారు. జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ షీటర్లకు అధికారులు ఆదివారం కౌన్సెలింగ్‌లు ఇచ్చారని ఎస్పీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో రౌడీషీటర్ల కౌన్సెలింగ్‌ల గురించి వివరించారు. జిల్లాలోని రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెంచామన్నారు. ఇక ముందు ఏ రౌడీషీటరైనా చట్టాన్ని ఉల్లంఘించినా, ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. రౌడీ షీటర్లలో మార్పు ఆశిస్తూ ఈ కౌన్సెలింగ్‌లు జరిగాయని వివరించారు.
అయినవిల్లి ఆలయం కిటకిట
అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 237 మంది పాల్గొన్నారు. ఏడుగురికి అక్షరభ్యాసాలు నిర్వహించారు. ఎనిమిది మందికి తులాభారం నిర్వహించారు. ఒకరికి నామకరణ చేయగా శ్రీ లక్ష్మీగణపతిహోమంలో 21 జంటలు పాల్గొన్నాయి. స్వామికి ఒక భక్తుడు తలనీలాలు సమర్పించారు. 40 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 4,860 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.3,78,641 లభించినట్లు ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
అవార్డు నిరాకరించిన విద్యుత్ శాఖ ఏఈ
మలికిపురం: ఉత్తమ సేవలకు అవార్డు వస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా స్వీకరిస్తారు. అది అరుదుగా లభించే అవకాశం. అయితే అలా ఉత్తమ సేవలకు అవార్డుకు ఎంపిక అయిన మలికిపురం, సఖినేటిపల్లి మండలాల విద్యుత్ శాఖ ఏఈ బొలిశెట్టి ప్రసాద్ అవార్డు స్వీకరణకు నిరాకరించారు. ఇటీవల సంభవించిన పెను తుపానులో విశేష సేవలు అందించిన ప్రసాద్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి జిల్లా స్థాయిలో ఉత్తమ ఉద్యోగి అవార్డు స్వీకరణకు ఆహ్వానం వచ్చింది. శనివారం వెళ్లాలి. అయితే తుపానుకు దెబ్బతిన్న స్తంభాల పునరుద్ధరణ పనులలో సఖినేటిపల్లి మండలంలో విద్యుత్‌శాఖ ఎలక్ట్రీషియన్ యడ్ల శంకర్ ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. మనస్థాపానికి గురైన ప్రసాద్ తనకు ప్రకటించిన అవార్డు తీసుకునేందుకు నిరాకరించారు.
హత్యకు గురైన శ్రీనివాస్
కుటుంబానికి ఎమ్మెల్సీల పరామర్శ
అమలాపురం టౌన్: హత్యకు గురైన అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫోన్‌లో ఆదివారం పరామర్శించారు. మృతుడు శ్రీనివాస్ భార్య దేవితో ఆయన మాట్లాడారు. ఇంత దారుణంగా హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చేసి, మేమంతా మీకు అండగా ఉంటామని ఆమెకు భరోసా ఇచ్చారు. తాను ప్రస్తుతం మాలలో ఉన్నానని, త్వరలోనే మీ కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. తన భర్తను అతి కిరాతంగా చంపారని శ్రీనివాస్ భార్య దేవి ఎమ్మెల్సీకి వివరించారు. కాగా శ్రీనివాస్ కుటుంబాన్ని ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు వేర్వేరుగా వారింటికి వెళ్లి పరామర్శించారు. హత్య చేసిన అయిదుగురు నిందితులను పోలీస్‌లు తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మృతుడు శ్రీనివాస్ సోదరుడు అంజితో ఎమ్మెల్సీలు మాట్లాడి మీ కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీలతో పాటు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సూదా గణపతి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి గుమ్మళ్ల సురేష్, చదలవాడ రాజారావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
							రౌడీషీటర్లు నేర ప్రవృత్తిని వీడాలి
							రౌడీషీటర్లు నేర ప్రవృత్తిని వీడాలి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
