ఆలయాల భద్రత గాలికి
మలికిపురం: భక్తులు అధికంగా వచ్చే ఆలయాల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మలికిపురంలో మీడియాతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కార్తిక ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రభుత్వం తరఫున సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల జరిగిన తొక్కిసలాటలో 9 మంది మృతి చెందారన్నారు. ఈ ఘటనకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఆ ఆలయం దేవదాయ శాఖ పరిధిలో లేదని, ఇటువంటి ఘటనలు అలా జరుగుతూ ఉంటాయని బాధ్యత లేకుండా మాట్లాడటం తగదన్నారు.
ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి, సింహాచలం ఆలయాల్లో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా భక్తుల మరణాలు సంభవించాయన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు సుస్పష్టంగా ప్రజలకు అర్థం అవుతున్న సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకి అలవాటుగా మారిందన్నారు. కాశీబుగ్గ ఉదంతంతో ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్‌ను ఆయనకు సంబంధంలేని నకిలీ మద్యం కేసులో అరెస్టు చేశారన్నారు. ఈ దుర్మార్గాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, జరిగిన తప్పుని హుందాగా ఒప్పుకుని భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్పాల్సిన ప్రభుత్వం ఈ విధమైన రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అన్నారు. హిందూ దేవాలయాలకు వెళ్తున్న భక్తుల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రజలు, భగవంతుడు ఈ ప్రభుత్వానికి శిక్ష వేస్తారని శివకుమార్ అన్నారు.


