
.
మామిడికుదురు: ఆ అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామిని చూసిన ప్రతి మదీ మురిసింది.. తన్మయత్వంతో మునిగి తేలింది. శనివారం స్వామివారి ఆలయానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. కొత్త, పాత గుడి వద్ద రద్దీ నెలకొంది. తొలుత భక్తులు పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తలనీలాలు సమర్పించారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. స్వామివారి సన్నిధిలో నిత్యం నిర్వహించే శ్రీలక్ష్మీ నారాయణ హోమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
సుప్రభాత సేవను ఆలయ అర్చకులు ఘనంగా జరిపించారు. తదుపరి ప్రాతః కాలంలో తొలి హారతిని దర్శించుకునేందుకు విశేష సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,38,498 ఆదాయం వచ్చింది. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.72,224 విరాళాలుగా అందించారు. 3,800 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, రెండు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ ఏర్పాట్లను ఆలయ ఈఓ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు.