
డీజిల్ లోకో షెడ్‌లో కవచ్ లోకోను ప్రారంభిస్తున్న డీఆర్‌ఎం లలిత్ బోహ్ర
వాల్తేర్ డివిజన్‌లో తొలి ‘కవచ్’ డీజిల్ లోకో ప్రారంభం
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైలు ప్రమాదాల నివారణకు మరో ముందడుగు పడింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ‘కవచ్’ (ట్రైన్ కొలైజన్ అవాయ్‌డెన్స్ సిస్టం–టీఏసీఎస్) అమర్చిన తొలి డీజిల్ లోకోను (ఇంజన్) వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) లలిత్‌బోహ్ర సోమవారం ప్రారంభించారు. వాల్తేర్ డివిజన్, డీజిల్ లోకోషెడ్‌లో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది.
డీజిల్ లోకో షెడ్ సిబ్బంది మొదటిగా డబ్ల్యూఏజీ–9హెచ్‌సీ ఫ్రైట్ లోకోకు కవచ్‌ను అమర్చారు. అంచెలంచెలుగా మరో 123 లోకోలకు మొదటి ఫేజ్‌లో కవచ్‌లను ఏర్పాటుచేయనున్నారు. వాల్తేర్ డివిజన్ పరి«ధిలో గల డీజిల్ లోకో షెడ్ ఇప్పటికే 500 మీటర్ల కవచ్ ఆధారిత టెస్టింగ్ ట్రాక్‌ను కూడా కలిగి ఉండడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
తొలి ‘కవచ్’ డీజిల్ లోకో ప్రారంభం నేపథ్యంలో రైలు ప్రమాదాల నివారణ దిశగా వాల్తేర్ డివిజన్ మరో రికార్డు నెలకొల్పినట్లయ్యింది. రైళ్ల భద్రతకోసం అత్యాధునికంగా తయారుచేసిన ఈ కవచ్ వలన రైలు ప్రమాదాలను నిలువరించవచ్చు. ఇది లోకోలో ఏర్పాటుచేసే ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టం. దీనివలన సురక్షిత వేగం, ప్రమాదకర పరిస్థితుల్లో రైలు నియంత్రణ సాధ్యమవుతుంది.