విద్యా ప్రవేషాలు | - | Sakshi
Sakshi News home page

విద్యా ప్రవేషాలు

Jul 31 2025 7:42 AM | Updated on Jul 31 2025 7:42 AM

విద్య

విద్యా ప్రవేషాలు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పక్కాగా అడ్మిషన్లు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఆర్టీఈ అడ్మిషన్లను పక్కాగా అమలు చేశారు. పేదల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు. జిల్లాలో 2022–23లో 342 పాఠశాలలో 201 మందికి ప్రవేశాలకు గాను 150 మంది వరకు చేరారు. 2023–24లో ఏకంగా 1,793 మందికి 1,256 మంది, 2024–25లో 2,805 మందికి 1,501 మందికి మాత్రమే ప్రవేశాలు దక్కాయి. ఇంచుమించు సగం మందికి అంటే 1,304 మంది దూరంగా ఉన్నారు. ప్రస్తుత కూటమి సర్కారు ఆర్టీఈ ప్రవేశాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

మొక్కుబడిగా ఆర్‌టీఈ అడ్మిషన్లు

చట్టం ఆదేశాలు పట్టించుకోని ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు

సీట్ల కేటాయింపునకు సాకులు

ఇచ్చినా అదనపు వసూళ్లు

పేద విద్యార్థుల తల్లిదండ్రుల అవస్థలు

సాక్షి, అమలాపురం: కూటమి పాలనలో విద్యాహక్కు చట్టాలు కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థలకు చుట్టాలుగా మారిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు 25 శాతం ఉచితంగా సీట్లు ఇవ్వాలని చేసిన నిబంధనను ప్రైవేట్‌ సంస్థలు అపహాస్యం చేస్తున్నాయి. 2025–26 విద్యా సంవత్సరానికి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు, విద్యాహక్కు చట్టం నిబంధనలను యాజమాన్యాలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా పట్టించుకునేవారే లేరు. నిబంధనలను పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వెనకడుగు వేయడం వెనుక ప్రభుత్వ పెద్దల అనధికార ఆదేశాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల అలసత్వం

విద్యాహక్కు చట్టం జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. దీని అమలుపై విద్యాశాఖ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్లల్లో ఈ చట్టం కచ్చితంగా అమలు చేయాలి. స్కూళ్లు ప్రారంభించిన వెంటనే ఆర్టీఈ (విద్యాహక్కు చట్టం) కింద ఒకటో తరగతి అడ్మిషన్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆన్‌లైన్‌ లాటరీ విధానంలో విద్యార్థులకు పలు పాఠశాలల్లో ప్రవేశాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ప్రవేశాల పత్రాలను తల్లిదండ్రులు తీసుకెళ్లి ప్రైవేటు పాఠశాలల్లో ఇస్తుంటే అడ్మిషన్లు ఇచ్చేందుకు రకరకాల సాకులు చెబుతున్నారు.

రెండు విడతలు

జిల్లాలో రెండు విడతలుగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. మొదటి విడతలో 815 మంది చిన్నారుల అడ్మిషన్లకు అర్హత జాబితాను ప్రకటించగా, 643 మంది వివిధ పాఠశాలల్లో చేరారు. రెండవ విడతలో 338 మంది అర్హత ఉన్న చిన్నారుల జాబితా ప్రకటించగా, 210 మంది ప్రవేశాలు పొందారు. మొత్తం 1,153 మందికి అడ్మిషన్లకు సీట్లు కేటాయించగా, 853 మంది అడ్మిషన్లు పొందారు. ఇంకా 300 మందికి అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంది.

ఆదేశాలు బేఖాతరు

విద్యా హక్కు చట్టం ప్రకారం 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో సీట్లు కేటాయిస్తుంది. దీనిని ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయనట్లుగానే పరిగణించాలి. దీనిపై తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం అధికారులకు ఉంటుంది. అవసరమైతే ఆ స్కూల్‌ అనుమతి రద్దు చేయడం జరుగుతుంది. అయితే పేదల సీట్ల విషయంలో అధికారులు ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్లను బతిమలాడుకోవాల్సి వస్తోంది.

సీట్లు రద్దు చేశారు

విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలో 25 శాతం సీట్లను అర్హులైన పేద, మధ్య తరగతి విద్యార్థులతో భర్తీ చేయాలి. అలా చేయకుంటే ప్రైవేట్‌ యాజమాన్యాలు విద్యాహక్కు చట్టాన్ని అవహేళన చేస్తున్నట్టే. ఈ చట్టాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయాలి. కొన్ని పాఠశాలలకు సీట్లు కేటాయించగా వారికి తల్లికి వందనం వచ్చిందని చెప్పి సీట్లు రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం.

– రేవు తిరుపతిరావు,

పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

అదనంగా వసూలు

చట్టం ప్రకారం ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పిస్తే 8వ తరగతి వరకూ వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టార్‌–1 రేటింగ్‌ ఉన్న పాఠశాలకు రూ.8,500, స్టార్‌–2 పాఠశాలలకు రూ.10 వేలు, స్టార్‌–3 పాఠశాలలకు రూ.11,500, స్టార్‌–4 పాఠశాలలకు రూ.13 వేలు, స్టార్‌–5 పాఠశాలలకు రూ.14,500లను ఫీజుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. రెండు విడతలుగా (సెప్టెంబర్‌, జనవరి) అడ్మిషన్లు ఇచ్చిన పాఠశాలలకు ప్రత్యేక ఖాతాకు జమ చేస్తారు. ప్రభుత్వం నుంచి వస్తున్నదే కాకుండా ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు ఇతర రకాలుగా అదనంగా సొమ్ము వసూలు చేస్తున్నాయి. దీనితో పూర్తి ఉచిత విద్య కాస్తా పాక్షిక ఉచిత విద్యగా మారిపోతోంది. బస్సు, పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, బెల్టు, బిల్డింగ్‌ ఫండ్‌, స్పెషల్‌ ఫీజు ఇలా రకరకాల బాదుడు మామూలే. ఆ డబ్బులు ఆయా తల్లిదండ్రులు చెల్లించాల్సిందే. కేవలం ట్యూషన్‌ ఫీజులో మాత్రమే కొంత రాయితీ ఇస్తున్నట్టుగా మారింది. అడ్మిషన్ల అమలు ప్రక్రియ అంటేనే ప్రైవేట్‌ యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి.

విద్యా ప్రవేషాలు1
1/2

విద్యా ప్రవేషాలు

విద్యా ప్రవేషాలు2
2/2

విద్యా ప్రవేషాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement