
సబ్ జైళ్ల దుస్థితిపై శాసన మండలిలో ప్రశ్నిస్తా
అమలాపురం టౌన్: రాష్ట్రంలోని సబ్ జైళ్ల దుస్థితిపై శాసన మండలిలో ప్రశ్నిస్తానని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తెలిపారు. అమలాపురం హైస్కూలు రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆగస్టులో జరిగే శాసన మండలి సమావేశాల్లో సబ్ జైళ్ల సమస్యలపై తాను అడిగేందుకు వీలుగా దీనికి సంబంధించిన ప్రశ్నను మండలి కార్యాలయ అధికారులకు బుధవారం పంపించానని చెప్పారు. అమలాపురం, రాజోలు, ముమ్మిడివరాల్లోని బ్రిటీషు కాలంలో రాళ్లతో నిర్మించిన పటిష్టమైన కట్టడాలతో ఉన్న సబ్ జైళ్లను ఆధునీకరణ పేరుతో వాటి సేవలను గత టీడీపీ ప్రభుత్వం నిలిపేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మూడు పూర్వపు తాలూకా ప్రదేశాల్లో సబ్ జైళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల నిందితులను పోలీస్ ఎస్కార్ట్‌తో వ్యయ ప్రయాసలకోర్చి కొత్తపేట లేదా రాజమహేంద్రవరం సెంట్రల్ జైళ్లకు పంపించాల్సి వస్తోందన్నారు. దీనివల్ల పోలీసుల ఎస్కార్ట్, కేసు పూర్వ పరాల కోసం నిందితులున్న జైళ్లకు వెళ్లే న్యాయవాదులు, నిందితుల కుటుంబ సభ్యులు ములాఖత్‌లు కోరేందుకు ఎంతో వ్యయం, సమయం వృథా అవుతోందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆధునీకరణ పేరుతో అమలాపురం సబ్ జైలు మూసివేసిన దుస్థితిపై ‘సాక్షి’లో సోమవారం వచ్చిన కధనం ఆధారంగా మిగతా జైళ్ల దుస్థితిపై శాసన మండలిలో ప్రశ్నించనున్నట్లు ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు తెలిపారు.
రాష్ట్రంలో మహిళలకు
రక్షణ కరవు
అమలాపురం టౌన్: రాష్ట్రంలో మహిళలకు ముఖ్యంగా బాలికలకు రక్షణ లేకుండా పోతోందని, అసలు లా అండ్ ఆర్డర్ అమలవుతుందా అనే సందేహం కలుగుతోందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్ ప్రశ్నించారు. ప్రతి శాఖలోనూ వైఫల్యాలతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలపై పట్టు కోల్పోతోందన్నారు. అమలాపురంలోని అరిగెలపాలెంలో బుధవారం జరిగిన ఆర్‌పీఐ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయవరం మండలం మాచవరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో బాలికపై ఆ స్కూలు కరస్పాండెంట్ లైంగిక దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వరస వైఫల్యాలను చూస్తుంటే ఇది మాటల ప్రభుత్వమే కానీ, చేతల ప్రభుత్వం కాదని తేటతెల్లమవుతోందన్నారు. ఆర్‌పీఐ నాయకుడు ఉండ్రు శ్యామలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కాండ్రేగుల పాఠశాలలో
అదనపు జిల్లా జడ్జి విచారణ
జగ్గంపేట: మండలంలోని కాండ్రేగుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం 7వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి జి.చంద్రమౌళీశ్వరి విచారణ నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన పాఠశాలలో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం, వారికి ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే. దీనిపై జిల్లా జడ్జి విచారణకు వచ్చి అస్వస్థతకు గురయిన విద్యార్థినులతోను, వైద్యం అందించిన డాక్టర్లతోనూ, విద్యార్థినులు తల్లిదండ్రులతో ఆరోజు జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. .
నవోదయ దరఖాస్తులకు
13 వరకూ గడువు
పెద్దాపురం: 2026–27వ ఏడాది పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో ఆరవ తరగతి ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తుల గడు వును ఆగస్టు 13వ తేదీ వరకుపొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 2025–26లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు.

సబ్ జైళ్ల దుస్థితిపై శాసన మండలిలో ప్రశ్నిస్తా