
వ్యాధుల నియంత్రణలో పురోగతి సాధించాలి
అమలాపురం రూరల్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ చర్యలకు సంబంధించి జిల్లా కొంచెం వెనుకబడి ఉందని, మెరుగైన పనితీరు కనబరుస్తూ వ్యాధుల నియంత్రణలో పురోగతిని సాధించాలని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పథక సంచాలకులు డాక్టర్ కె.నీలకంఠారెడ్డి అన్నారు. డీఆర్‌ఓ రాజకుమారి అధ్యక్షతన బుధవారం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలకంఠారెడ్డి మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్ కౌన్సెలింగ్ పరీక్షా కేంద్రాల నిర్వహణ, సుఖవ్యాధుల నివారణ, ఏరియా ఆసుపత్రులలో లైంగిక వ్యాధుల క్లినిక్‌లు, ఏఆర్టీ కేంద్రాల నిర్వహణను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రతి నెలా ఎటువంటి లోపాలు లేకుండా ఉచితంగా మందులు పంపిణీ జరగాలన్నారు. డీఆర్వో రాజకుమారి మాట్లాడుతూ ఏఆర్‌టీ కేంద్రాల్లో జీవితకాలం మందులను ఉచితంగా అందిస్తారని, మందులు క్రమం తప్పకుండా వాడించాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. ప్రతి ఐసీటీసీ కేంద్రంలో హెచ్‌ఐవీ పరీక్షతో పాటు తగిన సూచనలు, సలహాలు, ఉచిత సేవలకు సంబంధించిన సమాచారాన్ని బాధిత రోగులకు అందించాలన్నారు. అదనపు ప్రాజెక్టు సంచాలకులు కామేశ్వర ప్రసాద్ జిల్లాకు సంబంధించి వివిధ పారామీటర్ల వారీగా నియంత్రణ చర్యల పురోగతిని సిబ్బంది ద్వారా సమీక్షించారు. జిల్లా విద్యాశాఖ అధికారి సలీం బాషా మాట్లాడుతూ రక్త మార్పిడి, ఇంజెక్షన్ సూదులు, విచ్చలవిడి శృంగారం తదితర వాటి ద్వారా వ్యాధి సంక్రమణకు ఎక్కువ ఆస్కారం ఉందన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో దుర్గారావు దొర, డీసీహెచ్ ఎస్.కార్తిక్, అదనపు డీఎంహెచ్‌వో, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి సీహెచ్‌వీ భరతలక్ష్మి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రాంగోపాల్ పాల్గొన్నారు.