
కూటమి ప్రభుత్వానికి గుణపాఠం
రాయవరం: విద్యారంగ సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న ఆర్థిక సమస్యలకు తోడు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. బోధనమాటెలా ఉన్నా, బోధనేతర పనులకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వారందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పీ 4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్ షిప్) కార్యక్రమాన్ని ఉపాధ్యాయులపై రుద్దడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తమ ఆర్థిక సమస్యలను పక్కన పెట్టడంతో పాటు తిరిగి తమను పీ4లో భాగస్వాములు కావాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ప్రస్తుతానికి వెనక్కు తగ్గినట్లుగా చెబుతున్నాయి. అయినప్పటికీ అపరిష్కృత సమస్యలపై పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. దీనిలో భాగంగా ఆగస్టు 2న అన్ని జిల్లా కేంద్రాల్లో, ఆగస్టు 12న రాష్ట్ర స్థాయిలో ధర్నా చేపట్టడానికి ఫ్యాఫ్టో పక్షాన నిర్ణయం తీసుకున్నారు.
ఉపాధ్యాయుల డిమాండ్లు
ఫ పీ–4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు.
ఫ ఇటీవల అప్‌గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి.
ఫ పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలి. కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలి.
ఫ 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి, 30శాతం ఐఆర్ ప్రకటించాలి.
ఫ రిటైర్మెంట్ అయిన వారికి వెంటనే గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ తదితర బకాయిలు వెంటనే చెల్లించాలి.
ఫ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు మూడు పెండింగ్ డీఏలను ప్రకటించాలి.
ఫ డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలి.
ఫ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 2004 సెప్టెంబరు 1వ తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన వారందరికీ కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం అమలు చేసి, పాత పెన్షన్ విధానం తీసుకురావాలి.
ఫ ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలి.
ఫ హైస్కూల్ ఫ్లస్‌ల్లో వెంటనే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి, యథాతథంగా కొనసాగించాలి.
ఫ ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలి. పరీక్షలను తెలుగులో రాసే అవకాశం కల్పించాలి.
ఫ సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి గ్రేడ్–2 పండిట్లు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలి.
ఫ మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ తదితర సమస్యలను పరిష్కరించాలి.
ఫ ఈహెచ్‌ఎస్/మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల విషయంలో నిత్యం ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించాలి.
ఫ మండల విద్యాశాఖాధికారుల బదిలీలు చేపట్టాలి.
ఫ ఇంకా పదవీ కాలం పూర్తి కాని స్కూల్ గేమ్స్ సెక్రటరీలను తిరిగి కొనసాగించాలి.
ఫ అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలి.
ధర్నా విజయవంతానికి కార్యాచరణ
ఫ్యాఫ్టో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ధర్నా విజయవంతానికి కార్యాచరణ రూపొందించే పనిలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిమగ్నమయ్యారు. ఆగస్టు 2వ తేదీన చేపట్టే జిల్లా స్థాయి ధర్నాను విజయవంతం చేసేందుకు జిల్లా నాయకత్వాలు సమావేశం కానున్నాయి.
ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై
గురువుల కన్నెర్ర
పోరుబాటకు సిద్ధమైన వైనం
విద్యారంగ, ఆర్థిక సమస్యల
పరిష్కారానికి డిమాండ్
ప్రత్యక్ష చర్యకు నోటీసు ఇచ్చిన
ఫ్యాఫ్టో నాయకత్వం
ఆగస్టు 2న జిల్లా,
12న రాష్ట్ర స్థాయిలో ధర్నాలు