
సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి
పి.గన్నవరం: ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మిండగుదటి శిరీష్ ఆధ్వర్యంలో ఆయన బుధవారం పి.గన్నవరం మండలం నరేంద్రపురం గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంతో సంబంధిత శాఖల అధికారుల్లో కాస్తంత కదలిక వచ్చిందన్నారు. విద్యార్థి నాయకుల రాకముందే హాస్టళ్లలో పారిశుధ్య మెరుగుకు చర్యలు చేపడుతున్నారన్నారు. దీనికి నరేంద్రపురం గురుకుల వసతి గృహంలో అత్యవసరంగా చేపట్టిన శుభ్రత – పరిశుభ్రత కార్యక్రమమే నిదర్శనమన్నారు. తాము గురుకులాన్ని సందర్శించిన సమయంలో అక్కడ క్షీణించిన పారిశుధ్యం మెరుగుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నిస్తూ దర్శనమిచ్చారన్నారు. స్టూడెంట్స్ యూనియన్ నాయకులు వస్తున్నారని తెలిసి, తూతూమంత్రంగా వంటగది, పాత్రలు శుభ్రం చేశారని కొందరు విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. నిరంతరం పారిశుధ్య చర్యలు కొనసాగాలని, విద్యార్థులకు మంచి ఆహారం అందించాలని, మౌలిక సదుపాయాల కల్పనపై శ్రద్ధ పెట్టాలని పానుగంటి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ప్రసాద్, రీజనల్ కో ఆర్డినేటర్ రమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి సహదేవ్, రాజోలు అధ్యక్షుడు నవీన్, కొత్తపేట అధ్యక్షుడు రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు కరుణ సాయి, అర్జున్, అమర్, సుజిత్, పి.గన్నవరం మండల అధ్యక్షుడు సురేష్, ఐనవోలు మండల అధ్యక్షుడు రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్
రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి
నరేంద్రపురం గురుకులం పరిశీలన