
కూటమి నేతలు ప్రజలను మోసగించారు
కొత్తపేట: ఎన్నికల ముందు నోటికొచ్చిన వాగ్దానాలు చేసి, సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించిన కూటమి నాయకులు, తీరా అధికారం చేపట్టాక ఆ హామీలు గాలికొదిలేసి ప్రజలను దారుణంగా మోసం చేశారని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇచ్చే పథకం అమలు చేయాలంటే ఏపీని అమ్మాలి.. అని రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా ఇచ్చిన హామీలు అమలు చేయని పాలన సుపరిపాలన ఎలా అవుతుంది? అని జగ్గిరెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గాలికొదిలేయడం, ఆ నెలలో, ఈ నెలలో అంటూ వాయిదాలు వేయడం, తాజాగా మంత్రి పై విధంగా వ్యాఖ్యానించడం, అడబిడ్డ పథకం ఎలా అమలు చేయాలనే అంశంపై ఆలోచన చేస్తున్నామనడం కూటమి నేతలు చేతకాని పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ కూటమి పాలనలో అన్ని వర్గాలను దారుణంగా దగా చేశారన్నారు. దానిలో భాగంగా వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశారని, రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారని, వారి నుంచి కొనుగోలు చేసిన ధాన్యం డబ్బు చెల్లించకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. చెప్పినవి చెప్పినట్టుగా అన్ని పథకాలు అమలు చేసిన ఘనత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. జగన్ – చంద్రబాబు పాలనల్లో వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారని, రాబోయే రోజుల్లో తగు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని జగ్గిరెడ్డి అన్నారు.
మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలపై జగ్గిరెడ్డి ధ్వజం