
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 11 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, కేశఖండన, అన్నదాన విరాళాల రూపంలో స్వామివారికి రూ.2,50,681 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ వివరించారు. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు.
రత్నగిరి కిటకిట
అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. సాధారణంగా ఆషాఢ మాసంలో సత్యదేవుని ఆలయానికి భక్తుల రాక తక్కువగా ఉంటుంది. అటువంటిది శనివారం భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామివారిని సుమారు 40 వేల మంది దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారని అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లను టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఊరేగించనున్నారు.