యువతికి నరకం అంటే ఏంటో చూపించిన పూజారి | Delhi Priest Arrested for AI-Generated Obscene Deepfake Harassment After Woman Rejects Friendship Request | Sakshi
Sakshi News home page

యువతికి నరకం అంటే ఏంటో చూపించిన పూజారి

May 28 2026 4:21 PM | Updated on May 28 2026 5:28 PM

Womans Digital Nightmare

Representative image

ఢిల్లీకి చెందిన ఓ పూజారి (27) తన ఫ్రెండ్‌షిప్‌ రిక్వెస్ట్‌ను తిరస్కరించిన ఓ యువతికి నరకం చూపించాడు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో అసభ్యకర, నగ్న మార్ఫింగ్ ఇమేజ్‌లు, ఫొటోలు రూపొందించాడు. ఆ పూజారి ఆన్‌లైన్‌లో మత వీడియోలు చేసేవాడు. సులభంగా దొరికే ఏఐ టూల్స్‌ వాడి మహిళ ఫొటోలను మార్చి, అనేక నకిలీ సోషల్ మీడియా ఖాతాల్లో అతడు అప్‌లోడ్‌ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

అహ్మదాబాద్ సిటీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అతడిని ఢిల్లీలో గుర్తించి, బుధవారం అరెస్టు చేశారు. మహిళలను ఆన్‌లైన్ వేధింపుల నుంచి కాపాడే “మిషన్ సైబర్ రక్షిక: #సెక్యూర్ హర్ స్పేస్” కార్యక్రమం కింద ఈ అరెస్టు జరిగింది.

ఎలా మొదలైంది? 
ఆన్‌లైన్‌లో మత ప్రవచనాలు చేసే సుమిత్ నేమ్‌చంద్ శర్మతో గుజరాత్‌కు చెందిన ఓ మహిళకు సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. శర్మ మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో చాట్‌చేసి, మత విషయాలపై సంభాషణలు ప్రారంభించినట్టు సమాచారం. తర్వాత అతడు ఆమెతో స్నేహం చేయాలని ప్రయత్నించగా, మహిళ తిరస్కరించింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2025 డిసెంబర్ నుంచి 2026 ఏప్రిల్ 6 వరకు అతడు ఇంటర్నెట్ ద్వారా మహిళను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఏఐతో అసభ్యకర కంటెంట్ 
బాధిత మహిళ శర్మతో ఫ్రెండ్‌షిప్‌ను తిరస్కరించడంతో ఆ యువతి, ఆమె తల్లి ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి డౌన్‌లోడ్ చేశాడు. ఫొటోల్లో దుస్తులు లేకుండా చేసే ఏఐ టూల్స్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతికాడు శర్మ. ఆ టూల్స్‌ సాయంతో 100కు పైగా అసభ్యకర మార్ఫింగ్ నగ్న చిత్రాలు, వీడియోలు తయారు చేశాడు. వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశాడు.

ఆ మహిళ పేరు, ఫొటోలు వాడి శర్మ 3 నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, ఓ యూట్యూబ్ ఛానల్ సృష్టించాడు. ఏఐతో తయారైన కంటెంట్‌ను వాటిలో అప్‌లోడ్‌ చేసి, మహిళ, ఆమె కుటుంబ ప్రతిష్ఠ దెబ్బతినేలా కామెంట్స్‌ పెట్టాడు. దర్యాప్తులో పోలీసులు, ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికల్లో అతడు 8 నుంచి 10 వరకు నకిలీ ఖాతాలు సృష్టించినట్టు గుర్తించారు.

“నిందితుడు ఆ యువతితో పాటు ఆమె తల్లి ఏఐ మార్ఫింగ్ నగ్న ఫొటోలు, వీడియోలను నకిలీ ఖాతాల్లో అప్‌లోడ్‌ చేశాడు. మహిళను మానసికంగా వేధించి, సమాజంలో ఆమె ప్రతిష్ఠ దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసభ్యకర కంటెంట్ పోస్ట్ చేశాడు” అని అధికారులు తెలిపారు.

“యువతి, ఆమె తల్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి డౌన్‌లోడ్ చేసి, గూగుల్‌లో ‘ఏఐ రిమూవ్ క్లోత్స్’ అని వెతికిన తర్వాత అనేక వెబ్‌సైట్లు వాడి, కృత్రిమ మేధ సాధనాలతో మార్ఫింగ్ నగ్న చిత్రాలు, వీడియోలు తయారు చేశాడు” అని అధికారులు తెలిపారు.

ఢిల్లీలో దొరికిపోయాడు..
బాధిత యువతి అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బృందాన్ని ఆశ్రయించింది. ఇన్‌స్పెక్టర్ ఎంహెచ్ భేటారియా నేతృత్వంలోని పోలీసు బృందం, డిజిటల్ ట్రాకింగ్, మానవ సమాచార సాయంతో ఈశాన్య ఢిల్లీలోని ఉస్మాన్‌పూర్‌లో నిందితుడి ఆచూకీని గుర్తించింది. ఆ ప్రాంతంలో పోలీసులు దాడి చేసి శర్మను అరెస్టు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement