ఢీకొట్టి పారిపోయిన డ్రైవర్ : పట్టించిన పెన్ క్యాప్

సాక్షి,చిత్తూరు(ఎర్రావారిపాళెం): ట్రాక్టర్‌ను బైక్ ఢీకొన్న ఘటనతో భయపడి పరారైన ట్రాక్టర్ డ్రైవర్‌ను పెన్‌క్యాప్ పట్టించింది. కేసును ఎస్‌ఐ వెంకటమోహన్ గంటలో ఛేదించారు. వివరాలు.. మండలంలోని ఆవులయ్యగారిపల్లెకు చెందిన గురవయ్య దామలచెరువులో ట్రాక్టర్ మామిడికాయలు దించి ఇంటికి తిరుగు పయనమయ్యాడు. నెరబైలు గ్రామం పులిబోనుపల్లె సమీపంలో సిద్దలవాండ్లపల్లెకు చెందిన కంచన ఈశ్వరయ్య, రెడ్డెప్ప బోడేవాండ్లపల్లె నుంచి బైక్‌పై ఎదురుగా వస్తూ ట్రాక్టర్‌ను ఢీ కొన్నారు. ఈ సంఘటనలో ఈశ్వరయ్యకు తీవ్రగాయాలు కాగా, రెడ్డెప్ప స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
కేసు తనమీదకు వస్తుందని ట్రాక్టర్‌తో సహా డ్రైవర్ గురవయ్య పరారయ్యాడు. అప్పటికే సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటమోహన్ స్థానిక యువకులను అప్రమత్తం చేశారు. గురవయ్య ట్రాక్టర్‌ను గుర్తించి విచారణ చేశారు. ఎంతకీ తన ట్రాక్టర్ ప్రమాదానికి గురైందని అతను అంగీకరించలేదు. అయితే ఈశ్వరయ్య పెన్ క్యాప్ ట్రాక్టర్ ట్రాలీకి తగులుకుని ఉండటాన్ని గుర్తించి ట్రాక్టర్, గురవయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు.