అంత్యక్రియలకు సిద్ధం.. అంతలోనే అనుమానాస్పదం..!

Suspicious Death Of Married Woman In Siddipet District - Sakshi

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌)/సిద్ధిపేట జిల్లా: సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతిచెందింది. నల్లగొండ జిల్లా వెంకటాపూర్‎కు చెందిన పావని అలియాస్ కాత్యాయినికి, సిద్దిపేట జిల్లా జగదేవ్‎పూర్ మండలం మునిగడపకు చెందిన నాగరాజుతో రెండేండ్ల క్రితం పెళ్లి అయింది. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో ఉన్నట్టుండి అలజడిరేగింది.
చదవండి: మస్కట్‌లో ఏం జరిగింది..? మహిళ సెల్ఫీ వీడియో కలకలం..

ఏమైందో తెలియదు కానీ, మంగళవారం రాత్రి పావని జ్వరంతో చనిపోయిందని నాగరాజు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. కూతురు మరణించిందనే బాధతో ఆమె పుట్టింటివారు, బంధువులు హుటాహుటిన మునిగడపకు చేరుకున్నారు. పావని రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోందని, ఉన్నట్టుండి చనిపోయిందని నాగరాజు చెప్పడంతో అందరూ అదే నిజమనుకున్నారు.

అయితే పావని అంత్యక్రియలకు బుధవారం ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఆమెకు స్నానం చేయిస్తుండగా ఒంటిపై గాయాలు గమనించారు. వెంటనే పావని తల్లి పూర్తిగా పరిశీలించగా.. పావని శరీరం మొత్తం గాయాలతో హూనమైపోయింది. ఆగ్రహంతో నాగరాజును నిలదీయగా.. వెంటనే కుటుంబసభ్యులతో సహా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పావని కుటుంబసభ్యులు సమాచారమివ్వడంతో.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. తమ కూతురును కొట్టి చంపి.. జ్వరంతో చనిపోయిందని అంటున్నారని వాపోయారు. తమ కూతురు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. నిజమేంటో తేల్చాలని కోరుతున్నారు. పావని కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మృతదేహాన్ని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top