కొడుకే యముడై..

Son Stabs Father To Death Over Property Dispute In Begumpet - Sakshi

ఆస్తి కోసం తండ్రిని చంపిన తనయుడు 

కొడవలితో నరికి దారుణ హత్య 

రెండో భార్య కుమారుడి ఘాతుకం 

బేగంపేట విమాన్‌నగర్‌లో ఘటన

సనత్‌నగర్‌: కన్నబిడ్డల్ని చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడి విద్యాబుద్ధులు నేర్పించడానికి తండ్రి రెక్కలుముక్కలుగా చేసుకుని కష్టపడతాడు. అలాంటి తండ్రిని వృద్ధాప్యంలో మేమున్నామంటూ ఆదరించి చూసుకోవాలి. కానీ.. ఓ కుమారుడు కర్కశంగా మారాడు. ఆస్తి గొడవలతో కన్నతండ్రినే కడతేర్చాడు. గొడ్డలితో నరికి దారుణంగా చంపిన విషాదకర ఘటన ఆదివారం బేగంపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విమాన్‌నగర్‌లో జరిగింది.

ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు చెప్పిన వివరాల ప్రకారం.. బేగంపేట విమాన్‌నగర్‌కు చెందిన అబ్రహం లింకన్‌ (84) ఆర్మీలో ఉద్యోగ విరమణ అనంతరం బీహెచ్‌ఈఎల్‌ పని చేసి అక్కడ రిటైర్డ్‌ అయ్యారు. ఆయన మొదటి భార్య మహబూబ్‌నగర్‌లో ఉంటోంది. ఆమెకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో కుమారుడు, ఓ కుమార్తె చనిపోయారు. ప్రస్తుతం ఒక కుమార్తె మాత్రమే ఉంది. రెండో భార్య శేరిలింగంపల్లిలో నివాసం ఉంటోంది. ఆమెకు ఒక కుమారుడు కిరణ్‌ (30), కుమార్తె ఉన్నారు. అబ్రహం లింకన్‌ను ఇద్దరు భార్యలు, పిల్లలు ఎవరూ పట్టించుకోకపోవడంతో విమాన్‌నగర్‌లోని రాహుల్‌ రెస్టారెంట్‌లో వంట మనిషిగా పని చేస్తూ అక్కడేనివాసం  ఉంటున్నాడు.  

తండ్రికి తెలియకుండా ప్లాట్ల విక్రయం.. : అబ్రహం లింకన్‌కు షాద్‌నగర్‌లో ప్రభుత్వం నాలుగన్నర ఎకరాల భూమి రిటైర్డ్‌ ఆర్మీ కోటాలో కేటాయించింది. శేరిలింగంపల్లిలో 200 గజాలవి 2ఖాళీ ప్లాట్లున్నాయి. కొద్ది రోజుల క్రితం రెండో భార్య కుమారుడు కిరణ్‌ ఈ స్థలాలను తండ్రికి తెలియకుండా నకిలీ గిఫ్ట్‌ డీడ్‌తో రూ.75 లక్షలకు విక్రయించాడు. అబ్రహాం లింకన్‌కు డబ్బు అవసరం ఉండటంతో ఈ రెండు ప్లాట్లను విక్రయించేందుకు యత్నించగా ఆయన కుమారుడు ఇతరులకు విక్రయించినట్లు తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలతో ఈ స్థలాలు కొన్న వారు మరో రూ.25 లక్షలు ఇస్తామని చెప్పారు.  

భూమి తన పేరిట రాయాలని.. :కిరణ్‌ షాద్‌నగర్‌లో ఉండే నాలుగున్నర ఎకరాల భూమి కూడా తన పేరుపై రాయాలని, అదనంగా వచ్చే రూ.25 లక్షలు తనకే ఇవ్వాలని తండ్రిపై ఒత్తిడి తెస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చాయి. ఆదివారం ఉదయం కిరణ్‌ తనతో పాటు కొడవలిని తీసుకుని విమన్‌నగర్‌లోని తండ్రి వద్దకు వచ్చాడు.

ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండగానే కొడవలితో తండ్రి మెడపై నరికాడు. తీవ్ర గాయాలపాలైన అబ్రహం లింకన్‌ను స్థానికులు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే  ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top