గుట్కా స్థావరంపై ఎస్‌ఈబీ దాడులు | SEB attacks on Gutka base | Sakshi
Sakshi News home page

గుట్కా స్థావరంపై ఎస్‌ఈబీ దాడులు

Aug 8 2021 5:12 AM | Updated on Aug 8 2021 5:12 AM

SEB attacks on Gutka base - Sakshi

పట్టుబడిన గుట్కాలు, నిందితులతో ఎస్‌ఈబీ అధికారులు

నెల్లూరు (క్రైమ్‌): నెల్లూరులో గుట్కా స్థావరంపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఈబీ అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ (ఏఈఎస్‌) కృష్ణకిశోర్‌రెడ్డి దాడుల వివరాలను శనివారం విలేకరులకు వెల్లడించారు. హరనాథపురం నాగసాయి దేవాలయం సమీపంలో ఉంటున్న సీహెచ్‌ రాజశేఖర్‌ అలియాస్‌ శేఖర్‌ బెంగళూరు నుంచి పెద్ద ఎత్తున నిషేధిత గుట్కాలను నెల్లూరుకు దిగుమతి చేసుకునేవాడు. అనంతరం తన సహాయకుడైన స్టోన్‌హౌస్‌ పేటకు చెందిన టి.ప్రసాద్‌ ద్వారా ఆటోలో నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యాపారులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకొనేవాడు. ఈ వ్యవహారంపై ఎస్‌ఈబీ జేడీ కె.శ్రీలక్ష్మికి సమాచారం అందింది.

ఆమె ఆదేశాల మేరకు శనివారం ఎస్‌ఈబీ నెల్లూరు–1 ఇన్‌స్పెక్టర్‌ కె.పి.కిశోర్‌ తన సిబ్బందితో కలిసి ముత్తుకూరు రోడ్డులోని ఆకుతోట వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. గుట్కా వ్యాపారి రాజశేఖర్‌ సహాయకుడు ప్రసాద్‌ ఆటోలో గుట్కాలు తరలిస్తుండగా ఇన్‌స్పెక్టర్‌ అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నెల్లూరు రూరల్‌ మండలం వడ్డిపాలెంలో గుట్కాలను నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గోదాము వెలుగులోకి వచ్చింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ గోదాముపై దాడి చేసి నిషేధిత గుట్కా, ఖైనీలను, ఆటోను స్వాధీనం చేసుకుని రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సరకు విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.25 లక్షలు ఉంటుందని ఎస్‌ఈబీ ఏఈఎస్‌ కృష్ణకిశోర్‌రెడ్డి తెలిపారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న గుట్కాలు, ఆటోను తదుపరి విచారణ నిమిత్తం నెల్లూరు రూరల్‌ పోలీసులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున గుట్కాలు, ఖైనీలను స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్న ఇన్‌స్పెక్టర్‌ కె.పి.కిశోర్, ఎస్‌ఐ ఎ.శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ఎ.శ్రీరాములు, డి.వెంకటేశ్వర్లును ఎస్‌ఈబీ జేడీ కె.శ్రీలక్ష్మి అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement