గుజరాత్‌లో భారీ డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు.. విలువ వెయ్యి కోట్లకు పైగా | Rs 1,000 Crore Contraband Seized at Mundra Port in Kutch | Sakshi
Sakshi News home page

గుజరాత్‌లో భారీ డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు.. విలువ వెయ్యి కోట్లకు పైగా

May 27 2026 7:17 PM | Updated on May 27 2026 7:36 PM

Rs 1,000 Crore Contraband Seized at Mundra Port in Kutch

గాంధీనగర్‌: గుజరాత్‌లో భారీ డ్రగ్స్‌ ముఠాను యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) పోలీసులు గుట్టు రట్టుచేశారు. కచ్‌లో సుమారు రూ.1180 కోట్ల విలువైన 118 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురు విదేశీయులను అరెస్టు చేశారు.

రాష్ట్రంలో ఇటీవల భారీ ఎత్తున డ్రగ్స్‌ రవాణా జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్, పలు లాటిన్ అమెరికా దేశాలు, మెక్సికో, అమెరికా, కరాచీ (పాకిస్థాన్‌) మీదుగా ప్రయాణించి గుజరాత్ తీరానికి ఓ ఓడ చేరుకుంది. ముంద్రా తీరానికి సుమారు 9.5 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఆ ఓడ నుంచి అనుమానాస్పదంగా ప్యాకెట్లు సముద్రంలోకి విసురుతున్నట్లు కోస్ట్‌ గార్డులు గుర్తించారు. వెంటనే గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులకు సమాచారం అందించగా.. ఏటీఎస్‌–కోస్ట్‌ గార్డ్‌ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించారు.

ఆపరేషన్‌ సమయంలో ఓడలో ఇద్దరు నైజీరియన్‌ జాతీయులు ఉండగా, వారిలో ఒకరు సముద్రంలోకి దూకి తప్పించుకున్నారు. మరో ఇద్దరిని క్లావిన్‌ చుక్వుమా (టాంజానియా పౌరుడు), బ్యారుహంగా జేమ్స్‌ (ఉగాండా పౌరుడు)గా గుర్తించారు. కంటైనర్ల ద్వారా తెచ్చిన కొకైన్‌ను భారత్‌లో ఎవరికి అందించాలనుకున్నారు. ఏ ప్రాంతానికి తరలించాలనుకున్నారు అనే విషయాలను పోలీసులు విచారిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ డ్రగ్స్‌ను ఢిల్లీలోని ద్వారకలో నివసిస్తున్న ఇద్దరికి అందజేయాల్సి ఉందని నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది.

గత ఏడాది ఏప్రిల్‌ 13న పోర్‌బందర్‌లో రూ.1800 కోట్ల విలువైన 300 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్‌ 12 రాత్రి జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో గుజరాత్‌ ఏటీఎస్‌, కోస్ట్‌ గార్డ్‌ బృందం, పోర్‌బందర్‌కు 190 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకుంది.

గుజరాత్‌ ఏటీఎస్‌ సమాచారం మేరకు, కోస్ట్‌ గార్డ్‌ అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) వద్దకు గాలింపు నౌకను పంపింది. కోస్ట్‌ గార్డ్‌ బృందం ఒక పడవను గుర్తించి, అందులోని వారి వ్యక్తిగత వివరాల గురించి ఆరా తీసింది. దీంతో భయపడిన స్మగ్లర్లు మత్తుమందు ప్యాకెట్లను సముద్రంలోకి విసిరేసి, అంతర్జాతీయ సరిహద్దు దాటి పారిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement