ఆరేళ్ల క్రితం అదృశ్యమైన పోలీసు ఉద్యోగి ప్రత్యక్షం 

A policeman Who Disappeared Six Years Ago Has Reappeared In Nellore - Sakshi

వరకట్నం వేధింపులపై రిమాండ్‌ ఖైదీగా జైలుకు.. 

బెయిల్‌పై బయటకు వచ్చి  కేరళకు వెళ్లి అజ్ఞాతం

అక్కడి సేవా సంస్థ ప్రతినిధుల సహకారంతో తిరిగొచ్చిన వైనం

అదుపులోకి తీసుకుని విచారిస్తున్న రూరల్‌ పోలీసులు

నెల్లూరు రూరల్‌: వరకట్న వేధింపులతో జైలుపాలై ఆరేళ్ల క్రితం అదృశ్యమైన పోలీసు ఉద్యోగి శుక్రవారం నెల్లూరులో ప్రత్యక్షయ్యాడు. జిల్లాలోని ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసే శివకుమార్‌సింగ్‌ నెల్లూరు రూరల్‌ పరిధిలోని కొత్తూరు పోలీసు కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో నివశిస్తుండేవాడు. మొదటి భార్య నుంచి విడిపోయి విడాకులు తీసుకున్న అతను తిరిగి గుంటూరుకు చెందిన సుభాషిణిని రెండో వివాహం చేసుకుని పోలీసు కాలనీలో ఉంటుండేవాడు. రెండో భార్యతో కూడా వివాదాలు తలెత్తడంతో ఆమె మహిళా పోలీసుస్టేషన్‌లో శివకుమార్‌సింగ్‌పై వరకట్న వేధింపుల ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసుగా ఉండి జైలులో గడపడంతో భార్య సుభాషిణిపై తీవ్రంగా మనస్తాపం చెందాడు. రిమాండ్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లకుండా ఎవరికీ కనిపించకుండా అదృశ్యమయ్యాడు. దీంతో రెండో భార్య సుభాషిణి సోదరుడు తులసీరామ్‌సింగ్‌ నెల్లూరు రూరల్‌ పోలీసులకు 2016లో ఫిర్యాదు చేశాడు.

అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. అతని ఆచూకీ తెలియకపోవడంతో సుభాషిణి గుంటూరుకు వెళ్లి అక్కడే ఉంటుంది. అదృశ్యమైన అతడిని ఈ ఏడాది జూలైలో కేరళలోని ఓ సేవాసంస్థ వారికి కనిపించాడు. అనారోగ్యంతో ఉన్న అతడికి చికిత్స అందించడంతో కోలుకున్నాడు. తాను నెల్లూరులోని పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్నట్లు వారికి చెప్పాడు. దీంతో సేవాసంస్థ ప్రతినిధి అతడిని వెంటబెట్టుకుని నెల్లూరు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top