వివాహేతర బంధం ఆ మహిళకు యమపాశమైంది

Police Arrested Couple Accused In Woman Assassination Case Guntur - Sakshi

సాక్షి, బాపట్ల: వివాహేతర బంధం ఆ మహిళకు యమపాశమైంది. ఓ వ్యక్తి చెడు వ్యవసనాలు అప్పులుపాలు చేయటంతోపాటు హత్య చేసేందుకు పురిగొల్పాయి. భర్త చేసిన నేరంలో పాలుపంచుకున్న భార్య కూడా కటకటలపాలైంది. బాపట్ల సబ్‌ డివిజన్‌లోని నగరం స్టేషన్‌ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితులైన భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేసి  కటకటాల వెనక్కి పంపించారు. డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హత్య కేసు వివరాలను వెల్లడించారు.  చదవండి:  (హైటెక్‌ వ్యభిచారం: వాట్సాప్‌లో ఫొటోలు.. ఓకే అయితే)

నవంబరు 4వ తేదీన ఇంటూరు సమీపంలోని పూడివాడ మురుగుకాలువలో మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన వీఆర్‌ఓ ఎం.విజయసాగర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్సై వాసు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు చెరుకుపల్లిలోని కొత్తపేటకు చెందిన కొటారి సామ్రాజ్యంగా గుర్తించారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే సామ్రాజ్యంకు ఇంటూరు గ్రామానికి చెందిన పోతర్లంక శ్రీనివాసరావుతో 20 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం ఉంది. ఇంటూరులో అప్పులు చేసిన శ్రీనివాసరావు అక్కడ నుంచి వచ్చి  బాపట్లలోని బేస్తపాలెంలో నివాసం ఉంటున్నాడు.


మాట్లాడుతున్న డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్సై వాసు

శ్రీనివాసరావు చెరుకుపల్లి వెళ్లి సామ్రాజ్యాన్ని నవంబరు 3వతేదీన  ఆమె బంధువులు నిజాంపట్నం మండలం కోనఫలం గ్రామంలో ఉండటంతో ద్విచక్రవాహనంపై  తీసుకుపోయాడు. బంధువుల ఇంట్లో శుభకార్యంలో పాల్గొని సాయంత్రం ఊరిబయట తన కోసం  ఎదురుచూస్తున్న శ్రీనివాసరావుతో కలిసి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమైంది. పథకం ప్రకారం శ్రీనివాసరావు కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి ఆమెతో తాగించి మురుగుకాలువలో ముంచి హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న ఐదున్నర సవర్ల బంగారం, కొద్దిగా వెండి, రూ.400 తీసుకుని మృతదేహాన్ని అక్కడే వదిలివెళ్లాడు.

అక్కడ నుంచి బాపట్లలోని బెస్తపాలెంకు చేరుకుని భార్య పద్మావతికి జరిగిన విషయం తెలియజేసి రూ.1.25 లక్షలకు బంగారం విక్రయించి వచ్చిన వాటితో అప్పులు తీర్చుకోవటంతోపాటు గుంటూరు, విజయవాడ, నెల్లూరు, గిద్దలూరు, ఖమ్మం, తల్లాడ వంటి ప్రాంతాల్లో తిరిగి మొత్తం ఖర్చు చేసుకున్నారు. సామ్రాజ్యం మృతదేహాన్ని గుర్తించినట్లు తెలుసుకున్న భార్యాభర్తలు వీఆర్వో విజయ్‌సాగర్‌ వద్దకు వచ్చి 5వతేదీన లొంగిపోయారు. నిందితులు విక్రయించిన బంగారాన్ని రికవరీ చేయటంతోపాటు వారిపై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసును అత్యంత వేగంగా చేధించిన సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్సై వాసులతోపాటు సిబ్బందికి రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని దృష్టికి తీసుకుపోయి రివార్డు అందించేందుకు కృషి చేస్తామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top