వైఎస్సార్‌సీపీ ఎంపీపీ హత్యకు సుపారి?

Plan of TDP leaders Prakasam district hired killer YSRCP MPP Assassination - Sakshi

ప్రకాశం జిల్లా కిరాయి హంతకుడితో టీడీపీ నాయకుల ప్లాన్‌ 

జైలు పరిచయంతో ప్రత్యర్థిపై పగ తీర్చుకునేందుకు కుట్ర 

రూ.20 లక్షలకు బేరం   

గ్రామంలో రెక్కీ నిర్వహిస్తుండగా అరెస్ట్‌  

రహస్య ప్రాంతంలో విచారణ 

టీడీపీ ముఖ్యనాయకుడి పాత్రపై అనుమానాలు 

పల్నాడులో కిరాయి హత్యలకు తెరదీసిన టీడీపీ నేతలు

సాక్షి, నరసరావుపేట: పల్నాడులో హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు కిరాయి హత్యలకు కూడా తెరతీశారు. పల్నాడు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీపీని హత్య చేసేందుకు టీడీపీ నాయకులు కిరాయి హంతకుడికి సుపారీ ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంపీపీ హత్య కోసం గ్రామానికి వచ్చి రెక్కీ నిర్వహిస్తున్న కిరాయి హంతకుడు సత్తు గాలయ్యను, అతన్ని నియమించిన టీడీపీ నేతలిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలిసింది. ఎంపీపీ హత్యకు రూ.20 లక్షలకు సుపారీ మాట్లాడుకున్నట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. జిల్లాలోని వైఎస్సార్‌సీపీకి చెందిన వెల్దుర్తి మండల ఎంపీపీ చింతా శివరామయ్యకి, స్థానికంగా టీడీపీ నేతలకు వైరం ఉంది. నాలుగు నెలల క్రితం టీడీపీ నాయకులు ఎంపీపీ హత్యకు ప్రయత్నించారు. హత్య చేయడానికి వచ్చిన వీరిద్దరూ పోలీసుల తనిఖీల్లో మారణాయుధాలతో సహా దొరికిపోయారు. వారిద్దరినీ పోలీసులు జైలుకు పంపారు. జైలులో ప్రకాశం జిల్లాకు చెందిన సత్తు గాలయ్య అనే కిరాయి హంతకుడితో వీరిరువురికి పరిచయమైంది. గుంటూరు వద్ద నల్లపాడు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కిరాయి హత్యలకు పాల్పడ్డట్లు గాలయ్యపై కేసులు ఉన్నాయి.

ఎంపీపీ హత్యకు గాలయ్యతో టీడీపీ నేతలు రూ. 20 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. టీడీపీ నాయకులు బెయిల్‌పై గత నెలలోనే విడుదల కాగా, గాలయ్య వారం క్రితం జైలు నుంచి బయటకు వచ్చాడు. ఎంపీపీ హత్యకు శనివారం ఉదయం 10 గంటలకు గాలయ్య గుండ్లపాడులోని టీడీపీ నేతల ఇంటికి చేరుకున్నాడు. తనపై టీడీపీ నాయకులు పగబట్టారన్న సమాచారంతో నిఘా ఉంచిన ఎంపీపీకి గ్రామంలో కొత్త వ్యక్తి తిరగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాలయ్య రెక్కీ నిర్వహిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెల్దుర్తి ఎంపీపీని హత్య చేయడానికి సుపారీ తీసుకున్నట్లు గాలయ్య తెలపడంతో ఇద్దరు టీడీపీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య కుట్ర వెనుక మాచర్ల నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత ఒకరి హస్తం ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ దిశగా పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. 13 ఏళ్లుగా ఒక్క ఫ్యాక్షన్‌  హత్య జరగని మాచర్లలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని చంద్రబాబు నియమించడం ద్వారా ఫ్యాక్షన్‌ హత్యలకు మళ్లీ ఊపిరిపోశారని, ఆయన వచ్చిన తర్వాతే హత్యలు, దాడులు పెరిగిపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top