ఐ లవ్‌యూ డాడీ.. అమ్మను గొంతుకోసి చంపేశా! క్షమించు

Mumbai: Son Killed Mother Due To Depression Later Attempt Suicide - Sakshi

ముంబై: మానసిక కుంగుబాటు.. మనిషిని తీవ్ర నిర్ణయాల వైపు అడుగులు వేయిస్తుంటుంది. అందుకే.. సమస్యలను ఇతరులతో పంచుకోవడం ద్వారా భారం దించుకోవడమో, కౌన్సెలింగ్‌ ద్వారా ఉపశమనం పొందడమో చేస్తుండాలి. కానీ, కొందరు అలాంటివేం చేయకుండా.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఓ తనయుడు కన్నతల్లినే హతమార్చాడు. 

ఒంటరితనంతో మానసికంగా కుంగిపోయిన కొడుకు.. కన్నతల్లినే హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. ఆపై పశ్చాత్తాపం చెంది.. ప్రాణం తీసుకోవాలనుకున్నాడు. తండ్రికి భావోద్వేగమైన లేఖ రాసి.. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దిగ్భ్రాంతికి గురి చేసే ఈ ఘటన ముంబై(మహారాష్ట్ర) ములుంద్‌లో చోటు చేసుకుంది. 

గుజరాత్‌కు చెందిన మహేశ్‌పంచల్‌ కుటుంబం.. వర్ధమాన్‌ నగర్‌లో స్థిరపడింది. వ్యాపారం రిత్యా ఊళ్లు పట్టుకుని తిరుగుతుంటాడు మహేష్‌. ఇదిలా ఉంటే.. ఇంజినీరింగ్‌ చదివిన మహేశ్‌ కొడుకు జయేశ్‌ పంచల్‌(22) చాలా కాలంగా డిప్రెషన్‌లో ఉన్నాడు. ఒంటరితనం భరించలేక.. సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక సతమతమయ్యాడు. నిద్రలో ఉలిక్కిపడి లేస్తూ.. విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు.


ఘటన జరిగిన ప్రాంతం ఇదే

ఒక్కగానొక్క కొడుకు కావడంతో తల్లి ఛాయా పంచల్‌ కంటికి రెప్పలా కాపాడుతూ వస్తోంది అతన్ని. అయితే హఠాత్తుగా తనకు డబ్బు కావాలని, ఆస్తిలో వాటా పంచాలంటూ తల్లితో గొడవకు దిగడం ప్రారంభించాడు. ఈ క్రమంలో.. మానసిక ఆరోగ్యం బాగోలేని కొడుకును మందలిస్తూ వస్తోందామె.   అయితే శనివారం రాత్రి తల్లి నిద్రలో ఉండగా.. కత్తితో గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు జయేశ్‌. ఆపై తాను చేసిన తప్పు గుర్తించి.. ‘‘ఐ లవ్‌యూ డాడీ.. అమ్మ చావుకు నేనే కారణం.. నేనే చంపేశా. నన్ను క్షమించూ’’ అంటూ గుజరాతీలో ఓ లేఖ రాసి ములంద్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర లోకల్‌ ట్రైన్‌ కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఛాయా ఒంటిపై 12 కత్తి పోట్లు ఉన్నాయని, కేసులో అనుమానితుడిగా భావిస్తున్న జయేష్‌ కోలుకుంటే తప్ప కేసు చిక్కుముడి వీడదని పోలీసులు చెప్తున్నారు. కన్నబిడ్డ చేతిలో భార్య మృతి చెందడంతో మహేశ్‌ పంచల్‌ విలపిస్తున్నాడు.

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి..
రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: తల్లి శవం ఓ గదిలో..  దోస్తులతో ఎగ్‌ కర్రీ దావత్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top