ప్రేమిస్తే చంపేస్తారు! | More Honor Killings In State Most Cases Directly Parents Kill Childrens | Sakshi
Sakshi News home page

ప్రేమిస్తే చంపేస్తారు!

Oct 19 2022 9:50 AM | Updated on Oct 19 2022 9:50 AM

More Honor Killings In State Most Cases Directly Parents Kill Childrens - Sakshi

యశవంతపుర: ప్రేమిస్తే కుటుంబ పరువు ప్రతిష్టల పేరుతో కన్నబిడ్డలనే ప్రాణాలు తీసే ఉదంతాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయి. తాజాగా ప్రేమ జంట హత్యకు గురైన సంఘటన బాగలకోట జిల్లాలో జరిగింది. జిల్లాలోని బేవినమట్టి గ్రామంలో బాలికను, ఆమె ప్రియున్ని బాలిక కుటుంబ సభ్యులే హతమార్చారు. వివరాలు.. గ్రామంలో నివసించే బాలిక, విశ్వనాథ నెలగి (22) అనే యువకుడు ప్రేమలో పడ్డారు. ఇది బాలిక కుటుంబానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అతన్ని ప్రేమించవద్దని బాలికకు పలుమార్లు నచ్చజెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఆమె తండ్రి పరసప్ప, సోదరుడు రవి హుల్లణ్ణవర(19), బావ హనుమంత మల్నాడద (22), మరో బంధువు బీరప్ప దళవాయి(18)లు కలిసి ఆ జంటను హత్య చేయాలని పథకం వేశారు. 

పెళ్లి చేస్తామని నమ్మించి దారుణం  
తమ కుట్ర ప్రకారం ప్రేమ జంటకు పెళ్లి చేస్తామని నమ్మించారు. అక్టోబరు 1వ తేదీన గదగ జిల్లా నరగుందలో ఉన్న విశ్వనాథ నెలగిని, బేవినమట్టిలో ఉన్న బాలికను నిందితులు కారులో తీసుకెళ్లారు. వాహనంలోనే బాలిక గొంతుకు చున్నీతో బిగించి, యువకున్ని తీవ్రంగా కొట్టి బండరాయితో బాది ప్రాణాలు తీశారు. అనంతరం శవాల నుంచి వ్రస్తాలను తొలగించి ఆలమట్టి రోడ్డులోని వంతెనపై నుంచి కృష్ణానదిలో పడేసి ఊరికి వెళ్లిపోయారు.  

విచారణలో వెలుగులోకి 
కొడుకు కనిపించకపోవడంతో యువకుని తండ్రి ఈ నెల 3న నరగుంద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు 11వ తేదీన కూతురు మిస్సయిందని ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఈ నెల 15 బాగల్‌కోట గ్రామీణ పోలీసులు అనుమానం వచ్చి రవి హుల్లణ్ణవరను అదుపులోకి తీసుకొని విచారించారు. తమ కుటుంబ పరువు పోతుందని భావించి హత్య చేశామని ఒప్పుకున్నాడు. దీంతో మిగతా నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. కృష్ణానదిలో పడవేసిన ఇద్దరి మృతదేహాలు ఇప్పటికీ దొరకలేదు. 

(చదవండి: చీకటి గదిలో బంధించి, బలవంతంగా పెళ్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement