రూ.50 కోసం గొడవ, షాపులోని గుమాస్తా మృతి

Man Deceased In Sattenapalli Over Money Issue - Sakshi

రూ.50 విషయంలో షాపు యజమానితో వినియోగదారుడు వాగ్వాదం

సర్ది చెప్పేందుకు యత్నించిన గుమస్తా బాజీపై దాడి

కిందపడి స్పృహ కోల్పోయిన బాజీ..

ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఘటన

సాక్షి, సత్తెనపల్లి: యాభై రూపాయల విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. తమ షాపు యజమానితో వినియోగదారుడు గొడవ పడుతుండగా మధ్యలో సర్ది చెప్పటానికి వెళ్లిన గుమస్తా.. వారి దాడిలో గాయపడి చనిపోయాడు. ఈ ఘటన బుధవారం రాత్రి సత్తెనపల్లిలో జరిగింది. వివరాలు.. సత్తెనపల్లిలోని పాత మార్కెట్‌ వద్ద ఉన్న శ్రీలక్ష్మి మారుతి సంగం పార్లర్‌లో పల్లపు కోటి వీరయ్య 15 రోజుల క్రితం కొన్ని వస్తువులు తీసుకుని రూ.50 ఫోన్‌ పే చేశాడు. అయితే అది ఫెయిల్‌ కావడంతో.. రూ.50 తర్వాత ఇస్తానని వెళ్లిపోయాడు.

షాపు యజమాని వైకుంఠవాసి మూడు, నాలుగుసార్లు అడిగినా వీరయ్య ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. రెండు రోజుల కిందట వీరయ్య సోదరుడు నాగేశ్వరరావు ఆ రూ.50 చెల్లించాడు. ఈ విషయం తెలిసి మనస్తాపానికి గురైన వీరయ్య.. తన మరో సోదరుడు తిరుమలేశ్వరరావుతో కలసి బుధవారం రాత్రి 10.30 సమయంలో సంగం పార్లర్‌ వద్దకు వచ్చి వైకుంఠవాసి, ఆయన భార్యతో గొడవకు దిగాడు. షాపులో గుమస్తాగా పనిచేస్తున్న షేక్‌ బాజీ(27) సర్దిచెప్పేందుకని.. వారి మధ్యకు వెళ్లాడు.

ఆ గొడవలో దెబ్బలు తగలడంతో బాజీ కింద పడి స్పృహ కోల్పోయాడు. బాజీని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబానికి చేదోడుగా ఉన్న బాజీ చిన్న వయసులోనే మృతి చెందడంతో.. అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ రఘుపతి తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top