దారుణం: సరదా కోసం శరీరంలోకి గాలి నింపి చంపేశారు!

Man Deceased Coworkers Pump Air Into His Body For Fun At West Bengal - Sakshi

కోల్‌కతా: సరదా కోసం కొంతమంది విపరీతబుద్ధితో ప్రవర్తిస్తూ.. ఎదుటివారి ప్రాణాలు తీసి రాక్షస ఆనందం పొందుతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి పశ్చిమ బెంగాల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాక్షస బుద్ధి కలిగిన కొందరు.. ఓ వ్యక్తి శరీరంలోకి బలవంతంగా గాలి నింపుతూ మరణించేలా చేశారు. వివరాల్లో వెళ్లితే.. పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఉన్న నార్త్ బ్రూక్ జూట్ మిల్లులో రెహమత్ అలీ వర్కర్‌ పనిచేస్తున్నాడు. నవంబర్‌ 16న నైట్‌ డ్యూటీ చేయడానికి రెహమత్ మిల్లుకు వెళ్లాడు.  రెహమత్‌ని తోటి వర్కర్లు కొంతసేపు ఆటపట్టించారు.

అంతటితో ఆగకుండా సరదా కోసం.. దారుణంగా ఎయిర్‌ పంపుతో అతని మలద్వారంలోకి బలవంతంగా గాలిని పంపారు. నిస్సహాయుడు అయిన రెహమత్‌ తనను వదిలిపెట్టమని ఎంత ప్రాధేయపడ్డా విడువకుండా వారు పైశాచిక ఆనందం పొందారు. ఈ ఘటన తర్వాత అతని ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో హుగ్లీలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత క్షిణించడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

గాలి పంపు ఒత్తిడి వల్ల అతని శరీరంలోని కాలయం పూర్తిగా పాడైపోవటంతో మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. అతనితో పాటు మిల్లులో పని చేసే.. షాజాదా ఖాన్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని రెహమత్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. షాజాద్‌ జూట్‌ మిల్లును శుభ్రం చేసే ఎయిర్‌ పంప్‌ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రెహమత్ మృతికి బాధ్యతవహిస్తూ.. నష్టం పరిహారం చెల్లించాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు యాజమాన్యం ఇంకా స్పందించలేదు. ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top