ఆరేళ్లుగా నక్కి.. ఆఖరికి చిక్కి

Man Absconding 6 Years Arrested For Killed Living Relationship Woman - Sakshi

సాక్షి, ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసిన కేసులో ఆరేళ్లుగా పరారీలో ఉన్న రాజమహేంద్రవరం సుబ్బారావునగర్‌కు చెందిన తొండపు నాగప్రసాద్‌(ప్రసాద్‌)ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు త్రీటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.మధుబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం రామన్నపాలేనికి చెందిన పేరుబోయిన శివభవాని (మృతురాలు) 2008లో మొదటిభర్త చనిపోవడంతో కుమార్తెను తీసుకుని బతుకుతెరువు నిమిత్తం రాజమహేంద్రవరం వచ్చింది.

ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులు, రోగులకు సేవలందిస్తూ వారిచ్చే డబ్బులతో తన కుమార్తెతో కలసి జీవిస్తుండేది. శివభవానికి కార్‌ డ్రైవర్‌ తొండపు నాగప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. నాగప్రసాద్‌ భార్యకు ఓ ప్రమాదంలో మతిస్థిమితం పోయింది. దీంతో 2014 నుంచి శివభవాని, తన కుమార్తెతో కలసి నాగప్రసాద్‌ ఇంట్లోనే కాపురం ఉన్నారు. అనంతరం ఆ ఇల్లు అమ్మేయడంతో పక్కనే ఉన్న సంజీవయ్యనగర్‌లో అద్దెకు వెళ్లారు. 2017 మార్చి 2న శివభవాని ఇంట్లో మృతిచెంది ఉంది. మృతురాలి తల్లి పేరుబోయిన కొవ్వాడమ్మ, బంధువులు వచ్చి చూడగా శివభవాని పీకకోసి ఉంది.

ముందురోజు తమకు గొడవ జరగడంతో ఆమె పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని నాగప్రసాద్‌ అందరినీ నమ్మించాడు. దీంతో బంధువులు శివభవాని మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువెళ్లి దహన సంస్కారాలు జరిపించారు. అంత్యక్రియలు పూర్తయిన రెండు వారాల తరువాత మృతురాలి సోదరుడు వెంకటేష్‌కు నాగప్రసాద్‌ ఫోన్‌ చేసి మీచెల్లి తనకు తానుగా పీక కోసుకుని ఆత్మహత్య చేసుకోలేదని, తరచూ డబ్బులు కోసం వేధిస్తుందని అందుకే తానే చంపేశానని తెలిపాడు.

దీంతో ఈ విషయమై 21 రోజుల అనంతరం మృతురాలి తల్లి కొవ్వాడమ్మ త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ రామకోటేశ్వరరావు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాగప్రసాద్‌ పరారీలో ఉండగా, ప్రస్తుత త్రీటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.మధుబాబు, సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ జేవీ సంతోష్‌ పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని అరెస్టు చేశారు. రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని అరెస్ట్‌ చేయడంలో ప్రతిభ చూపిన త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్స్‌ బీఎంవీవీ భానుమూర్తి, జె.సుబ్బారావు, క్రైమ్‌ కానిస్టేబుళ్లు కె.వెంకటేశ్వరరావు, బి.విజయకుమార్‌లను సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ జేవీ సంతోష్‌ అభినందించారు.  

(చదవండి: సీఎం జగన్‌ మాటిచ్చారు.. నెరవేర్చారు’)

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top