ప్లాన్‌ ప్రకారమే జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ ఘటన.. మైనర్లు ఉన్నందున పేర్లు కుదరదన్న సీపీ

Jubilee Hills Amnesia Pub Case: CV Anand Press Meet Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంచలన సృష్టించిన జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ సామూహిక అ‍త్యాచార కేసులో ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు నగర సీపీ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన నగర కమిషనర్‌.. ఈ కేసులో నిందితులు మైనర్లు కాబట్టి పేర్లు, ఇతర వివరాలు వెల్లడించడం కుదరని స్పష్టం చేశారు. 

జూబ్లీహిల్స్‌ కేసును లోతుగా దర్యాప్తు చేశాం. ఆరుగురిలో ఒకరు మేజర్‌,  ఐదుగురు మైనర్లు‌. కేసులో మైనర్లు ఉన్నందున పేర్లు చెప్పడం లేదు. మార్చి 28న ఈ వ్యవహారం మొదలైంది. బెంగళూరులో ఉండే ఒక స్టూడెంట్‌.. స్కూల్‌ మొదలుకాక ముందు పార్టీ చేసుకోవాలని హైదరాబాద్‌లో స్నేహితులతో ప్లాన్‌ చేశాడు. అందుకోసం అమ్నీషియా పబ్‌ను ఎంచుకుని.. ఏప్రిల్‌లో పార్టీ గురించి పోస్ట్‌ చేశాడు. 

నాన్‌ ఆల్కాహాలిక్‌, స్మోకింగ్‌ పార్టీ కోసం అప్లై చేసుకున్నారు. ఉస్మాన్‌ అలీఖాన్‌ అనే వ్యక్తి ద్వారా పబ్‌ను బుక్‌ చేయించారు. మే 28వ తేదీన పార్టీ గురించి సదరు స్టూడెంట్‌ మళ్లీ పోస్ట్‌ చేశాడు. మే 28వ తేదీన మధ్యాహ్నాం బాధితురాలు పబ్‌కు వెళ్లింది.

నిందితులు.. పబ్‌లో ముందుగానే పథకం వేసుకున్నారు. ఆమె ఫాలో చేసి ట్రాప్‌ చేశారు. అదే రోజు సాయంత్రం రోడ్డు నెంబర్‌ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. సాయంత్రం మళ్లీ పబ్‌ దగ్గర బాధితురాలిని వదిలిపెట్టారు.  ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్‌ ప్రకారం.. జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.  భరోసా సెంటర్‌లో కౌన్సెలింగ్‌ తర్వాత బాధితురాలు వివరాలు చెప్పింది. ఆ తర్వాత మరికొన్ని సెక్షన్లు నమోదు చేశాం.

పబ్‌, బేకరి వద్ద అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలించాం. ఏ1 సాదుద్దీన్‌తో పాటు మైనర్‌ నిందితులు, బాధితురాలు వాహనంలో వెళ్లారు. మైనర్‌తో పాటు సాదుద్దీన్‌ బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నిందితులను బాధితురాలు గుర్తించలేకపోయింది. ఆధారాలతో సహా జూన్‌ 2వ తేదీన నిందితులను గుర్తించాం. జూన్‌ 3న సాదుద్దీన్‌ను అరెస్ట్‌ చేశాం.  ఏ1 సాదుద్దీన్‌తో పాటు మిగతా వాళ్లపై కేసు నమోదు అయ్యింది. సాదుద్దీన్‌తో పాటు నలుగురిని అరెస్ట్‌చేశాం. మరొకరి కోసం స్పెషల్‌ టీమ్‌ ఏర్పాటు చేశాం. దర్యాప్తు చాలా పారదర్శకంగానే జరిగిందని.. పలు కోణాల్లో దర్యాప్తు చేయడం వల్లే ఆలస్యమైందని చెప్పారు. ఇలాంటి కేసుల్లో శిక్షలూ కఠినంగానే ఉంటాయని సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. పబ్‌ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్‌ స్పష్టం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top