భారతితో ప్రేమ.. తల్లిదండ్రులకు నచ్చకపోవడంతో.. ఫోన్‌ చేసి రప్పించి!

Hyderabad: Youth killed in Patancheru Body Dumped In canal - Sakshi

సాక్షి, పటాన్‌చెరు(సంగారెడ్డి): అదృశ్యమైన యువకుడు హత్యకు గురైన సంఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు గ్రామానికి చెందిన బాలేశ్వరమ్మ, తన ఇద్దరు కుమారులతో కలసి పటాన్‌చెరు మండలం పాటీ చౌరస్తా సమీపంలో నివసిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన రెండో కుమారుడు శివ కుమార్‌(18)కు ఫోన్‌ రావడంతో బయటకు వెళ్లి తిరిగి రాలేదు.  కుటుంబ సభ్యులు అతడి కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 10వ తేదీన బీడీఎల్‌ భానూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్‌ కుటుంబసభ్యులు ఉండే ప్రదేశం పటాన్‌చెరు పోలీసుస్టేషన్‌ పరిధిలోకి రావడంతో కేసును పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌కు మార్చారు.  

ప్రణాళిక ప్రకారమే హత్య చేశారా? 
నాగర్‌కర్నూలు జిల్లా కోడేరు మండలకేంద్రానికి చెందిన శివకుమార్, అదే గ్రామానికి చెందిన భారతి ప్రేమించుకుంటున్నారు. యువకుడి కుటుంబం పటాన్‌చెరు శివారు ప్రాంతంలో నివాసం ఉంటుండగా, యువతి కుటుంబం ముషీరాబాద్‌ ప్రాంతంలో ఉంటోంది. వారి ప్రేమ యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో ఈ నెల 7వ తేదీన భారతితో శివకుమార్‌కు ఫోన్‌ చేయించారు. ముషీరాబాద్‌ రావడానికి డబ్బులు లేవని శివకుమార్‌ చెప్పడంతో డబ్బులు ఆన్‌లైన్‌లో పంపారు. దీంతో అదే రోజు రాత్రి బయలుదేరాడు.

వెళ్లే ముందు ముషీరాబాద్‌ వెళ్తున్నట్టు తన ఇంటి సమీపంలో ఉంటున్న సతీశ్‌కు ఫోన్‌ చేసి తెలిపాడు. శివకుమార్‌ యువతి ఇంటికి వెళ్లగా ఆమె కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో తీసుకెళ్లి హత్యచేసి ఓ కాలువలో పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు ముషీరాబాద్‌ పరిధిలోని ఓ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. దీంతో మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలిసింది. ఈ ఘటనతో శివకుమార్‌ స్వగ్రామం కోడేరులో విషాదచాయలు అలుముకున్నాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top