ఆకలితో వెళ్తే.. దొంగ అనుకుని దాడి! బాధితుడి మృతి

Hotel Employees Brutally Attacks On Man In Hyderabad - Sakshi

సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ (హైదరాబాద్‌): ఆకలితో అలమటిస్తున్న ఓ వ్యక్తిపై మూకుమ్మడి దాడి జరగడంతో మృతి చెందిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది.  సీఐ కిషన్‌ కుమార్‌ వివరాల ప్రకారం.. ఒరిస్సాకు చెందిన రాజేష్‌ (32), భార్య, పిల్లలతో కలిసి మాదాపుర్‌లో ఉంటూ బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు.

బుధవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో జేఎన్‌టీయూహెచ్‌ మెట్రో స్టేషన్‌ పక్కనే ఉన్న మొఘల్స్‌ ప్యారడైజ్‌ రెస్టారెంట్‌ సెల్లర్‌లోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ రెస్టారెంట్‌ మేనేజర్‌ అరవింద్‌ పుట్టిన రోజు వేడుకలు సిబ్బందితో కలిసి చేసుకుంటున్నారు. వాళ్లు తినగా మిగిలింది తనకు ఇవ్వమంటూ రాజేశ్‌ వాళ్లను వేడుకున్నాడు. కానీ, మానవత్వం మరిచిపోయారు. దొంగగా పొరబడి వాళ్లంతా అతన్ని చితకబాది వెళ్లిపోయారు.

రాత్రంతా అక్కడే స్పృహ లేకుండా పడిఉన్న రాజేష్‌ను.. గురువారం ఉదయం హోటల్‌ సిబ్బంది గుర్తించారు. ఒరిస్సాలోని రాజేష్‌ తండ్రికి సమచారమివ్వగా అతను భార్య సత్యభామకు తెలుపడంతో ఆమె వెళ్లి ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి వెళ్లిన కాసేపటికే రాజేష్‌ మృతి చెందాడు. సత్యభామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హోటల్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  రాజేష్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నట్లు తెలిసింది. 

చదవండి: భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top