విద్యార్థి హత్య: ఎన్‌కౌంటర్‌లో నిందితుడు హతం | Ghaziabad student murder: Prime accused killed in police encounter | Sakshi
Sakshi News home page

విద్యార్థి హత్య: ఎన్‌కౌంటర్‌లో నిందితుడు హతం

May 31 2026 7:46 AM | Updated on May 31 2026 7:46 AM

Ghaziabad student murder: Prime accused killed in police encounter

ఘజియాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ను కుదిపేసిన 11వ తరగతి విద్యార్థి సూర్య చౌహాన్ దారుణ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా ఉన్న అసద్, పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. శనివారం ఇందిరాపురం ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్ ఉద్రిక్తతకు దారితీసింది.

ఎన్‌కౌంటర్ వెనుక ఉన్న అసలు కథ
మే 28న జరిగిన ఘర్షణలో సూర్య చౌహాన్ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. ప్రధాన నిందితుడు అసద్‌పై రూ. 50,000 రివార్డు ప్రకటించిన పోలీసులు, అతడి కోసం వేట మొదలుపెట్టారు. ఖోడా ప్రాంతంలో తన సహచరులను కలిసేందుకు అసద్ వస్తున్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు, అప్రమత్తమై చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మోటార్ సైకిల్‌పై వస్తున్న అసద్‌ను ఆపే ప్రయత్నం చేయగా, అతను పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అసద్‌కు తీవ్రగాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు.

కుట్రపూరిత హత్య: కుటుంబం ఆరోపణ
సూర్య కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, మే 28న ఫోన్ కాల్ చేసి ఈద్ వేడుకల కోసం రమ్మని పిలిచి, అతడిని ఒకచోట బంధించి దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులు కత్తులతో వెంటాడి మరీ సూర్యను పొడిచారని, తనను తాను కాపాడుకునేందుకు 200 మీటర్ల దూరం పరుగెత్తినా వదలకుండా దాడి చేశారని సోదరి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బుల్డోజర్లతో వారి ఇళ్లను కూల్చివేయాలని బాధితుడి తల్లి సరోజ్ డిమాండ్ చేస్తున్నారు.

చిన్న గొడవే ప్రాణం తీసింది
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సూర్య స్నేహితులే నిందితులు. మోటార్ సైకిల్ నడపడం విషయమై జరిగిన చిన్నపాటి వాగ్వాదం పెరిగి, కోపంతో అసద్ సూర్యను నిందితులు కత్తితో పొడిచినట్లు డీసీపీ ధవల్ జైస్వాల్ తెలిపారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, తుపాకీని స్వాధీనం చేసుకుని సోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అందం, హోదా.. అంతా అబద్ధమేనా?

Advertisement
 
Advertisement
Advertisement