కృష్ణవేణి దొరికింది.. చిన్నారి కిడ్నాప్‌ కథ సుఖాంతం | Sakshi
Sakshi News home page

కృష్ణవేణి దొరికింది.. చిన్నారి కిడ్నాప్‌ కథ సుఖాంతం

Published Thu, Jul 6 2023 12:36 PM

Ghatkesar: Police Saved The Child From The Kidnapper - Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: ఈడబ్ల్యూఎస్‌ కాలనీకి చెందిన రాజేశ్వరీ, భరత్‌ దంపతుల కుమార్తె కృష్ణవేణి (4) కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. బుధవారం రాత్రి చాక్లెట్‌ కోసం దుకాణానికి వెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లితండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. స్థానిక యువకులు అదే ప్రాంతంలోని ఓ సినిమా థియేటర్‌లో పనిచేస్తున్న మతి స్థిమితం లేని వ్యక్తి సురేష్‌పై అనుమానం వ్యక్తం చేశారు.

ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సురేష్‌, చిన్నారి కృష్ణవేణి ఫొటోలను అన్ని పీఎస్‌లు, చైల్డ్‌వెల్ఫేర్‌ సంస్థలు, రైల్వే పోలీసులకు పంపారు. మల్కాజ్‌గిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేశ్‌రెడ్డి, స్థానిక సీఐ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా సురేష్‌ కృష్ణవేణిని తీసుకెళుతున్నట్లు గుర్తించారు.

ఘట్‌కేసర్‌ నుంచి గూడ్స్‌ రైలులో ఖాజీపేట్‌ వెళ్లిన సురేష్‌ ఏమి చేయాలో తెలియక మరో రైలెక్కి తిరిగి సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అప్పటికే సమాచారం అందుకున్న రైల్వే రక్షణ పోలీసులు, చైల్డ్‌ గైడెన్స్‌ సెంటర్‌ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని చిన్నారిని తమ రక్షణలోకి తీసుకున్నారు. ఘట్‌కేసర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చిన్నారి ఫొటోను తల్లితండ్రులకు పంపించి సరిచూసుకున్నారు. దీంతో సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్స్‌ అశోక్‌ సికింద్రాబాద్‌ వెళ్లి చిన్నారిని  తీసుకు వచ్చారు. అనంతరం రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ స్వయంగా చిన్నారిని తల్లితండ్రులకు అప్పగించారు.

ఘాట్ కేసర్ కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. కిడ్నాపర్‌ నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. సీపీ ఫుటేజ్‌ ఆధారంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో నిందితుడు సురేష్‌, చిన్నారిని గుర్తించారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో బుధవారం రాత్రి నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.

మేడ్చల్‌లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటూ చిన్నారి కనిపించికుండా పోయింది. బాలిక కృష్ణవేణి రాత్రి షాప్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఎంత వెతికినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించి, కిడ్నాపర్ నుంచి పాపను కాపాడారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు చిన్నారిని సురక్షితంగా కాపాడారు.
చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు!

Advertisement
 
Advertisement
 
Advertisement