పాపం క్రాంతి.. పెంచి, పెళ్లి చేసుకొని.. హతమార్చాడు

Drunken Man Suspected Wife Killed Her At Ramagundam - Sakshi

చిన్నతనంలో అమ్మానాన్నను కోల్పోయిన ఆ అభాగ్యురాలు.. అమ్మమ్మ ఇంట్లో పెరిగింది. అన్నీ తానై పెంచిన మేనమామను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించసాగింది. కానీ, ఆ సంసారాన్ని.. అనుమానం అనే పెనుభూతం ఆవహించింది. చివరికి..  కంటికి రెప్పలా కాపాడి కట్టుకున్నవాడే ఆమెను దారుణంగా హత్య చేశాడు. 

సాక్షి, పాలకుర్తి(రామగుండం): చిన్నతనంలోనే అమ్మానాన్నను కోల్పోయిన ఆ అభాగ్యురాలు అమ్మమ్మ ఇంట్లో పెరిగింది. తనను పెంచిన మేనమామలలో ఒకరిని పెళ్లి చేసుకుంది. ఆనందంగా సాగుతున్న వారి సంసార జీవితాన్ని అనుమానం అనే పెనుభూతం ఆవహించింది. చివరికి కట్టుకున్నవాడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. బసంత్‌నగర్‌ పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకుర్తి మండలంలోని ఎల్కలపల్లి గ్రామానికి చెందిన పల్లె బాపు అనే వ్యక్తికి క్రాంతి, విమల్‌ సంతానం. 25 ఏళ్ల క్రితం బాపుతోపాటు అతని భార్య మృతిచెందారు. దీంతో క్రాంతి, విమల్‌లను వారి అమ్మమ్మ అయిన రాణాపూర్‌ గ్రామానికి చెందిన కొల్లూరి జక్కమ్మ చేరదీసింది. తన ఇద్దరు కుమారులైన అశోక్, అజయ్‌ల సహకారంతో పెంచి పెద్దచేసింది. 

తాగుడుకు బానిసై..
డిగ్రీ వరకు చదివించిన అనంతరం తన చిన్న కుమారుడైన అజయ్‌తో 2015లో క్రాంతికి వివాహం జరిపించింది. అజయ్‌ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ దంపతులకు నాలుగేళ్ల బాబు, రెండేళ్ల పాప ఉన్నారు. మద్యానికి బానిసై తరచూ గొడవ.. ఇప్పటిదాకా సజావుగా సాగిన క్రాంతి–అజయ్‌ల సంసారంలో ఇటీవల కలహాలు చోటుచేసుకున్నాయి. భార్యపై అనుమానంతో మద్యానికి బానిసైన అజయ్‌ తరచూ ఆమెతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రికుడైన అజయ్‌ రాడ్డుతో క్రాంతి తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై, అక్కడికక్కడే మృతిచెందింది. 

స్థానికుల సమాచారంతో బసంత్‌నగర్‌ ఎస్సైలు మహేందర్‌యాదవ్, శివానిరెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి అలువాల మారుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా నిందితుడు అజయ్‌ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

ఇదీ చదవండి: కాలేజ్‌ వద్ద డ్రాప్‌ చేస్తానని నమ్మించి.. కొంచెం దూరం వెళ్లాక..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top