మూడున్నరేళ్లు..రూ. 258 కోట్లు!

Cybercriminals have collectively stolen rs 258 crores - Sakshi

సైబర్‌ నేరాల్లో నగరవాసులు కోల్పోయిన మొత్తమిది 

2020 నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు 8,614 కేసులు 

993 మంది అరెస్టు, దర్యాప్తు పూర్తైన కేసులు 331 మాత్రమే 

సాక్షి, సిటీబ్యూరో/హిమాయత్‌నగర్‌: రోజుకు రూ.20 లక్షలు.. వారానికి రూ.1.41 కోట్లు.. నెలకు రూ.6.06 కోట్లు... ఏడాదికి రూ.73.7 కోట్లు.. నగర వాసుల నుంచి సైబర్‌ నేరగాళ్లు కాజేసిన మొత్తం సరాసరీ ఇది. 2020 జనవరి 1–2023 జూన్‌ 30 మధ్య నగర వాసుల నుంచి సైబర్‌ నేరగాళ్లు ఏకంగా రూ.258 కోట్లు స్వాహా చేశారు. సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో నమోదైన కేసులు వెల్లడిస్తున్న గణాంకాలివి. పరువు, మర్యాద, సమయం లేకపోవడం... ఇలా అనేక కారణాల వల్ల పోలీసుల వరకు రాని కేసుల్లో నçష్టపోయింది దీనికి రెట్టింపు ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.  

దర్యాప్తు అత్యంత జటిలం.. 
చాలా మందిలో అత్యాశ, తేలిగ్గా వచ్చే డబ్బుపై మక్కువే సైబర్‌ నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఈ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో.. కేసుల దర్యాప్తు, నేరగాళ్లను పట్టుకోవడం, అభియోగపత్రాల దాఖలు అంత కష్టం. కోవిడ్‌ కాలంలో ఉత్తరాదికి చెందిన వారిలో అనేక మంది జీవనోపాధి కోల్పోయారు. వీరిలో అత్యధికులు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్‌ మోసాలకు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు.

క్రిప్టో కరెన్సీ, బిట్‌ కాయిన్స్, పార్ట్‌ టైం ఉద్యోగాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్, గిఫ్ట్‌లు, లాటరీ, కేబీసీ, ఓటీపీ, మాట్రిమోనియల్, ఆన్‌లైన్‌ సూడో పోలీసు, కేవైసీ అప్‌డేట్, కరెంట్‌ బిల్లులు చెల్లింపు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, జాబ్‌ ఫ్రాడ్స్, పార్ట్‌టైహ్‌ జాబ్స్‌.. ఇలా వివిధ పంథాల్లో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.  

ఆ లింకులు క్లిక్‌ చేస్తే ముప్పే.. 
రాజస్థాన్, బిహార్, యూపీ, ఢిల్లీ, ఝార్ఖండ్‌ సహా ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాలకు చెందిన వారు వ్యవస్థీకృతంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. బాధితుల ప్రమేయం లేకుండానే టెలిగ్రామ్, వాట్సాప్‌ గ్రూప్స్‌లో యాడ్‌ చేసి ‘మైండ్‌ గేమ్‌’ ఆడుతున్నారు. వీరికి నమ్మకం కలిగించేందుకు నలుగురైదుగురితో తాము ఇప్పుడే రూ.లక్షల లాభాలు ఆర్జించామని, ఆ మొత్తం డ్రా చేసినట్లు చాటింగ్‌ చేయిస్తున్నారు.

ఇలా తమ వలలో పడిన వారికి ప్రత్యేక లింకులు పంపుతూ ఉచ్చులోకి దింపుతున్నారు. కొన్ని రకాల ప్రత్యేక లింకుల ద్వారా మాల్‌వేర్స్‌ పంపిస్తున్నారు. ఇలా వీరి సెల్‌ఫోన్‌ను సైబర్‌ నేరగాళ్లు తమ అదీనంలోకి తీసుకుంటున్నారు. ఆపై నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ ఐడీలు, పాస్‌వర్డ్స్‌ తస్కరించి అందినకాడికి దండుకుంటున్నారు.  

పట్టుకోవడం కష్టం.. రికవరీ అసాధ్యం.. 
సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు ఎక్కడా తమ ఉనికి బయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులు సహా ఏ ఒక్కటీ తమ పేరుపై లేకుండా కథ నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కేసుల్లో నేరగాళ్లను పట్టుకోవడం కష్టసాధ్యం, కాలయాపనతో కూడింది అవుతోంది. ఈలోపు వారి చేతుల్లోకి వెళ్లిన డబ్బు మరో చోటకు చేరడమో, ఖర్చు కావడమో జరిగిపోతోంది.

ఫలితంగా నిందితులు దొరికినా రికవరీలు మాత్రం అసాధ్యమవుతున్నాయి. ఈ కేసుల దర్యాప్తు పూర్తి చేసి, కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయడానికీ సమయం పడుతోంది. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, హార్డ్‌ డిస్క్‌లు తదితరాలను విశ్లేíÙంచి, రిపోర్టు ఇవ్వడానికి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ వద్ద కాలయాపన జరుగుతోంది. ఫలితంగా అభియోగపత్రాల దాఖలు కు చాలా సమయం పడుతోంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top