
బెంగళరూరు: నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థినిపై లెక్చరర్లు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన వెలుగుచూసింది. క్లాస్‌లో పాఠాలకు సంబంధించి ఓ విద్యార్థినికి టెక్ట్స్ మెసేజ్ చేసిన లెక్చరర్.. ఆపై సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఫ్రెండ్ రూమ్‌కు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై మరొక లెక్చరర్, అతని ఫ్రెండ్ కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా వెలుగు చూడటంతో బెంగళూరులో తీవ్ర కలకలం రేపుతోంది.
కర్ణాటకలోని ఓ విద్యార్థినిని ఫిజిక్స్ బోధించే లెక్చరర్ నరేంద్ర పరిచయం చేసుకున్నాడు. చదువులో సాయంతో పరిచయాన్ని సాన్నిహిత్యంగా మార్చుకున్నాడు. ఇలా అనూప్ అనే స్నేహితుడి రూమ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ అనూప్ కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డ వీడియోను చూపించి మరొక లెక్చరర్ సందీప్ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని ఆ విద్యార్థినిని నిత్యం వేధింపులకు గురి చేస్తుండటంతో తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వీరు కర్ణాటక మహిళా కమిషన్‌ను ఆశ్రయించడంతో విషయం బయటకొచ్చింది.
దీంతో మారతహళ్లి పోలీస్ స్టేషన్‌లో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఇద్దరు లెక్చరర్లు సహా స్నేహితుడు అనూప్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదిలావుంచితే, ఒడిశాలో కూడా ఇదే తరహా దారుణం ఇటీవల చోటు చేసుకుంది. తనను లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని ఓ విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసి ప్రాణాలు తీసుకుంది. ప్రిన్సిపాల్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బాలాసోర్ బీఈడీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. ఒంటికి నిప్పంటించుకుని 90 శాతం కాలిన గాయాల పాలైన ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసినప్పటికీ ప్రాణాలు కోల్పోయింది.