సాక్షి టాస్క్‌ఫోర్స్: గుడిపాల మండలంలో సోమవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ నాయుడు సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉపాధి హామీ నిధులతో ఈ పనులు చేపట్టారు. ఇక్కడ శిలాఫకాలను ఏర్పాటు చేశారు. ఈ శిలాఫలాకాల్లో టీడీపీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకుల పేర్లను మాత్రమే పెట్టారు. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులను ఎమ్మెల్యే మరిచారా అంటూ బీజేపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు రమాదేవి ఆయనపై మండిపడ్డారు. ‘‘మీ పార్టీ నాయకులకు ప్రొటోకాల్ ఉన్నప్పుడు, మాపార్టీకి ప్రొటోకాల్ వర్తించదా.. కూటమిలో బీజేపి, జనసేన పార్టీలు లేవా.. నేను మహిళ అని నాపై వివక్షా.. లేక మీకున్న అహంకారమా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు మమ్మల్ని పక్కన పెడతారు అనే దానికి ఇదే నిదర్శనం. మీతీరు మారకపోతే మా పార్టీ నేతలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటాం ’’అని ఆమె మండిపడ్డారు.


