చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకోనున్నట్టు వెల్లడించారు. వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు.
ప్రేమ పెళ్లి కాలేదని
యువకుడి బలవన్మరణం
యాదమరి: ప్రేమించిన యువతిని వివాహం చేసుకోలేకపోతున్నాననే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ ఈశ్వర్ తెలిపిన వివరాలు మేరకు.. మండల పరిధిలోని బండివాండ్లవూరు గ్రామాని కి చెందిన ఆర్.సూర్య(26) చిత్తూరులోని అమూల్ డెయిరీలో పనిచేస్తున్నాడు. తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోలేకపోతున్నానని పలుమార్లు కుటుంబసభ్యుల వద్ద బాధపడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పునకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని వృద్ధుడి మృతి
వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం పూడి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి కిందపడి మృతి చెందిన గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు సోమవారం గుర్తించారు. రైల్వే పీసీ శివకుమార్ కథనం మేరకు సుమారు 65 ఏళ్ల వృద్ధుడు రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి ఒంటిపై తెల్ల చొక్కా, పంచె ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 98491 44086 నంబరుకు ఫోన్ చేయాల్సిందిగా రైల్వే పోలీసులు తెలిపారు.
పవిత్రోత్సవాలకు
అంకురార్పణ
గంగవరం: టీటీడీ అనుబంధమైన మండలంలోని కీలపట్ల శ్రీకోనేటిరాయస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు సోమవారం వేడుకగా ప్రారంభమయ్యయి. నాలుగు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు కంకణబట్టార్ శ్రీకాంత్ ఆచార్యులు, ఆగమసలహాదారు ఏకే నరసింహాచార్యులు టీటీడీ పురోహితులు ఆధ్వర్యంలో అంకురార్పణం, మేధినీ పూజ, విశ్వక్సేన ఆరాధన, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారికి స్నపన తిరుమంజనం టీటీడీ వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య నేత్రపర్వంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. టీటీడీ ఏఈవో గోపీనాథ్ హాజరై ఆలయంలో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షించారు. కాగా మంగళవారం ఉదయం పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం కుంభారాధనలు, హోమం ఉంటుందని టెంపుల్ ఇన్‌స్పెక్టర్ మోహన రమణ తెలిపారు.


