అవినీతి ఆనందుడు | - | Sakshi
Sakshi News home page

అవినీతి ఆనందుడు

Oct 9 2026 6:54 AM | Updated on Oct 9 2026 6:54 AM

ఆర్జేడీ, కమిషనర్‌ సస్పెండ్‌ చేసినా మారని తీరు!

ముడుపులు ఇస్తేనే యూడైస్‌ సమస్యలకు మోక్షం

కలెక్టరేట్‌ వద్ద ‘అపుస్మా’ అసోషియేషన్‌ నాయకులు ధర్నా

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం కేంద్రంగా సాగిస్తున్న ముడుపుల దందాపై ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల నిర్వాహకులు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీకి ఫిర్యాదుచేశారు. ఏళ్ల తరబడి డీఈవో కార్యాలయంలో ఏఎస్‌వో (అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌) గా పనిచేస్తున్న ‘ఆనందుడు’ అలియాస్‌ ఆనంద్‌ తీరుపై పాఠశాల యాజమాన్యాలు విసిగెత్తిపోయాయి. ముడుపులు ఇస్తేనే ఫైలు కదిలించడం, ఇవ్వకపోతే నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పించుకోవడం ఆయనకు నిత్యకృత్యంగా మారిందని అపుస్మా నాయకులు వెల్లడించారు. ఆ ఏఎస్‌వో వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ అన్‌–ఎయిడెడ్‌ స్కూల్స్‌ యాజమాన్యాల సంఘం (అపుస్మా) నాయకులు కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ను కలసి ఏఎస్‌వో అక్రమాల చిట్టాను వినతిపత్రం రూపంలో అందజేశారు.

యూడైస్‌ కోడ్‌ కావాలా..

‘నజరానా’ ఇవ్వాల్సిందే!

పాఠశాలల గుర్తింపు, విద్యార్థుల నమోదు, మౌలిక వసతుల సమాచారం నమోదు చేసే అత్యంత కీలకమైన యూడైస్‌ డేటా సవరణల ప్రక్రియను సదరు ఏఎస్‌వో సాంకేతిక సమస్యలు, రికార్డుల నమోదు పేరుతో కరస్పాండెంట్లను లంచాల కోసం వేధిస్తున్నారన్నారు. అడిగినంత ఇస్తే క్షణాల్లో అయ్యే పని, ఇవ్వకపోతే నెలల తరబడి పెండింగ్‌లో పెడుతూ ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. సమస్యల పరిష్కారానికి కార్యాలయానికి వెళ్లే ప్రైవేట్‌ పాఠశాలల కరస్పాండెంట్లను చులకన భావనతో మాట్లాడటం, కనీస గౌరవం ఇవ్వకపోవడం ఆ అధికారికి అలవాటుగా మారిందని వెల్లడించారు.

సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్‌

ఏఎస్‌వో ఆనంద్‌ సాగిస్తున్న వేధింపులపై అపుస్మా నాయకులు సమర్పించిన ఆధారాలు, ఫిర్యాదుపై కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తక్షణమే స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన ట్లు రుజువైతే ఏఎస్‌వో పై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈవో లక్ష్మీనారాయణను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అపుస్మా అసోసియేషన్‌ నాయకులు మహేష్‌, ఎస్‌ఎస్‌కే రాజా, తేజోమూర్తి, రమణారెడ్డి, ప్రసాద్‌, వెంకటాచలం, జయచంద్ర, జానకిరామరెడ్డి, లోకేష్‌, పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు పాల్గొన్నారు.

డీఈవో కార్యాలయంలో చేతివాటం

గతంలో రెండుసార్లు సస్పెండ్‌ అయినా.. మారని ‘పైసల’ పిచ్చి!

ఓ ప్రైవేట్‌ పాఠశాల నిర్వాహకుడిని లంచం కోసం తీవ్రంగా వేధించడంతో, బాధితుడి ఫిర్యాదు మేరకు 2020 లో విద్యాశాఖ ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి ఆయనను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. 2022లో రెండో సస్పెన్షన్‌, యూడైస్‌ డేటా నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, తప్పులతడకగా రికార్డులు రూపొందించినందుకు ఏకంగా రాష్ట్ర విద్యాశాఖ కమిషనరే ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అయినా ఆ అధికాారి తీరులో మార్పు రాకపోవడం, మళ్లీ అదే స్థానంలో తిష్టవేసి వసూళ్ల దందాను కొనసాగించడంపై ప్రైవేట్‌ విద్యాసంస్థల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement