చిత్తూరులో వార్‌రూమ్ ఏర్పాటు అభినందనీయం: భూమన జిల్లా అంతటా ఏర్పాటుకు కృషి : జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ ఏకగ్రీవం బాబు లక్ష్యం : ఎమ్మెల్సీ భరత్
చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో లీగల్ టీమ్ కీలకంగా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన గురువారం చిత్తూరులో పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన లీగల్ విభాగం సమావేశంలో ముఖ్యతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా, ఎన్నికల్లో ఎదురయ్యే న్యాయ సమస్యలపై న్యాయవాదులతో వార్‌రూమ్ ఏర్పాటుకు చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ లీగల్ టీమ్‌ను ఏర్పాటు చేసి వారి సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులపై కేసులు పెట్టడం కూటమి పాలనలో పరిపాటిగా మారిందన్నారు. ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇంతమంది న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేయడం అరుదుగా జరుగుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేగౌడ మాట్లాడుతూ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోనూ వార్‌రూమ్ ఏర్పాటు అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లా మొత్తం పర్యటించి నాయకులతో సమన్వయం చేసుకుని ఇన్‌చార్జిలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడమే తన లక్ష్యమన్నారు. ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఏకగ్రీవం చేయాలని చంద్రబాబు అధికారులు, నాయకులకు అనధికారంగా ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. వారి అక్రమాలను ఎదుర్కొనేందుకు న్యాయవాదుల సహకారం అవసరమన్నారు. కుప్పం నియోజకవర్గంలో వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పోరాటం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ చిత్తూరు కార్పొరేషన్‌లో ప్రతి మూడు డివిజన్లకు నలుగురు న్యాయవాదులతో టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీరిని సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యాలయంలో వార్‌రూమ్ పనిచేస్తుందని తెలిపారు. అందులో ఐదుగురు సీనియర్ న్యాయవాదులు, ఇద్దరు విశ్రాంత తహసీల్దార్లు, ఇద్దరు విశ్రాంత ఉపాధ్యాయులు ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు కూటమి పార్టీ చేసే కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని తెలిపారు. కార్యక్రమంలో లీగల్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యుగంధర్, చిత్తూరు నియోజకవర్గ పరిశీలకులు రెడ్డెప్ప, మాజీ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సూర్యప్రతాప్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సుగుణశేఖర్‌రెడ్డి, న్యాయవాదులు పురుషోత్తం, విజయసింహారెడ్డి, బిందు, ప్రకాష్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


