చిత్తూరు కలెక్టరేట్ : కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి సరికాదని కర్ణాటక రాష్ట్రం భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రి చలువరాయస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్న కర్ణాటక మంత్రికి గురువారం చిత్తూరు సరిహద్దులో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలపై పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం దారుణమన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ తమ పార్టీ పిలుపు మేరకు బ్లాక్‌డే నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారెంటీలతో పాటు రాష్ట్రాన్ని వేగవంతమైన అభివృద్ధి పథంలో నడిపిస్తోందని తెలిపారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు.


