బాల్య వివాహాల కట్టడికి కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల కట్టడికి కఠిన చర్యలు

Oct 9 2026 1:26 AM | Updated on Oct 9 2026 1:26 AM

కుప్పం, పలమనేరులోనే అత్యధికంగా బాల్యవివాహాలు

జిల్లాలో నెలకు 400 బాల్యవివాహాలు

జీవో 31 అమలుకు పటిష్ట ఆదేశాలు

కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ, ఎస్పీ తుషార్‌ డూడీ

చిత్తూరు కలెక్టరేట్‌ : బాల్య వివాహాలు భవిష్యత్‌ను చిదిమేస్తాయని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు. ఆయన గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు, టీనేజ్‌ గర్భాలు ఎక్కువగా పెరుగుతున్నాయని తెలిపారు. బాల్య వివాహాల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో మార్పులు రాకపోతే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. జిల్లాలో బాల్య వివాహాలు, టీనేజ్‌ గర్భాల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ నివేదికలను పరిశీలిస్తే మూడేళ్లల్లో 10 వేల టీనేజ్‌ గర్భాలు నమోదైనట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం పెళ్లిళ్లల్లో 19 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. 15 నుంచి 18 ఏళ్లున్న, పదో తరగతి ఉత్తీర్ణత, ఫెయిల్‌ అయిన బాలికలకు పెళ్లిళ్లు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. జిల్లాలోని కుప్పం, పలమనేరు, బైరెడ్డిపల్లి, పూతలపట్టు ప్రాంతాల నుంచి కేసులు మరింత ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు. ఇందుకు క్షేత్రస్థాయి అధికారుల అలసత్వమే కారణమని మండిపడ్డారు. తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకుంటే కుదరదని హెచ్చరించారు. ప్రతి మండలంలో తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంఈవో, సీడీపీవోలు బాల్య వివాహాల కట్టడికి చర్యలు చేపట్టాలన్నారు.

సమన్వయ సమావేశాల నిర్వహణపై ఆరా

బాల్య వివాహాల కట్టడికి మండల స్థాయిలో సమన్వయ కమిటీ సమావేశాలను నెలకు ఒకసారి కచ్చితంగా నిర్వహించాల్సిందేనని తహసీల్దార్లను కలెక్టర్‌ ఆదేశించారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై కిశోర బాలికలు, పొదుపు సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో డ్రాపౌట్ల సంఖ్య 6 వేలు ఉందని, ఆ సంఖ్య మరింత తగ్గించాలన్నారు. 2023లో జారీచేసిన జీవో 31 ని మండల స్థాయిలో పక్కాగా అమలు చేయాలన్నారు.

మూడేళ్లల్లో 10 వేలు టీనేజ్‌ గర్భాలు

నెలకు 400 బాల్య వివాహాలు

జిల్లాలో టీనేజీ గర్భాలు, బాల్య వివాహాల పరిస్థితి ఆందోళనగా ఉందని డీఎంహెచ్‌వో నాగశశిభూషన్‌రెడ్డి తెలిపారు. అభా ఐడీల ప్రకారం జిల్లాలో ఏడాదిలో 12,042 మంది గర్భిణులు నమోదు అవుతుండగా, అందులో 1283 మంది టీనేజ్‌ గర్భిణులు ఉండడం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. సగటున జిల్లాలో ప్రతి నెలా 400 మంది బాలికలకు బాల్య వివాహాలు జరుగుతున్నాయన్నారు. బాలికలు గర్భం దాల్చిన విషయాన్ని కుటుంబ సభ్యులు దాచిపెడుతున్నారని పేర్కొన్నారు. 18 ఏళ్ల లోపు బాలికలు గర్భం దాల్చితే ప్రసవానికి కష్టమని, తద్వారా శిశు మరణాలు పెరుగుతాయన్నారు. పిల్లలు తక్కువ బరువుతో జన్మించడం, శ్వాసకోస ఇన్‌ఫెక్షన్స్‌తో ఇబ్బంది పడతారని తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, ట్రైనీ కలెక్టర్‌ వెంకటేష్‌, జిల్లా అధికారులు లక్ష్మినారాయణ, వెంకటరమణ, పద్మజ, ఏఎస్పీలు, డీఎస్పీలు, సీడీపీవోలు, ఎంఈవో, తహసీల్ధార్‌లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

పోలీసులు బాధ్యతగా పనిచేయాలి

బాల్య వివాహాల కట్టడిలో పోలీసులు బాధ్యతగా పనిచేయాలని ఎస్పీ తుషార్‌ డూడీ ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రతి నెలా రెండు ఫోక్సో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. పోలీసులు, అధికారులు పక్కాగా టార్గెట్లు నిర్ధేశించుకుని పనిచేస్తేనే బాల్యవివాహాల సంఖ్యను తగ్గించవచ్చన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా కేసులు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement